Mogalthur: మొగల్తూరులో మత్స్యకారుల బోటులో సీఎం చంద్రబాబు ప్రయాణం!
Mogalthur: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సీఎం చంద్రబాబు మత్స్యకారులతో కలిసి బోటులో ప్రయాణించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
Mogalthur: మొగల్తూరులో మత్స్యకారుల బోటులో సీఎం చంద్రబాబు ప్రయాణం!
మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని మొగల్తూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారుల కుటుంబాలను కలుసుకుని వారి సమస్యలు, జీవన పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులకు పింఛను సొమ్మును అందజేశారు.
మొగల్తూరులోని వేటకు వెళ్లే ఫెర్రీ పాయింట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత చేరుకున్నారు. అక్కడ పడవల వద్ద కూర్చున్న మత్స్యకారులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, వేట సమయంలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. తిరుమని స్వామి అనే మత్స్యకారుడికి ముఖ్యమంత్రి స్వయంగా పింఛను సొమ్మును అందజేశారు.
మత్స్యకారుల కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల వల్ల తమ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందని మత్స్యకారులు సీఎంకు తెలిపారు. ముఖ్యంగా వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.20 వేల ఆర్థిక సాయం తమ కుటుంబాలను ఆదుకుంటోందని చెప్పారు.
మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యం
సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు ఎదుర్కొనే ఇబ్బందులపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు. సముద్రంలో మత్స్యకారులు గల్లంతవుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల దాదాపు 20 రోజుల పాటు సముద్రంలో కనిపించకుండా పోయిన కోనసీమ ప్రాంతానికి చెందిన మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడంలో కోస్ట్‌గార్డ్, నేవీ, కేంద్ర మెరైన్ విభాగాల సహకారం తీసుకున్న విషయాన్ని వారికి వివరించారు.
మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లినప్పుడు ప్రమాద పరిస్థితులు ఎదురైతే తక్షణమే సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేటపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మత్స్యకారులతో కలిసి బోటులో ప్రయాణం
మత్స్యకారులతో మాట్లాడుతున్న సమయంలో ఓ మత్స్యకారుడు ముఖ్యమంత్రి చంద్రబాబును తమతో కలిసి పడవలోకి రావాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన సీఎం.. మత్స్యకారులతో కలిసి బోటులో ప్రయాణించారు. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారుల రోజువారీ జీవితం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు.
వేట కోసం సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఎన్ని గంటలు అక్కడే ఉండాల్సి వస్తుంది? సముద్రంలోనే భోజనం ఎలా చేస్తారు? వేటకు అవసరమైన సామగ్రి ఏమిటి? ప్రతిరోజూ ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి? వంటి వివరాలను ముఖ్యమంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు మారినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే విషయంపైనా ఆరా తీశారు.
మత్స్యకారులతో కలిసి బోటులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. వారి జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మత్స్యకారుల సంక్షేమం, భద్రత, ఆర్థిక భరోసా కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. తమతో కలిసి బోటులో ప్రయాణించిన ముఖ్యమంత్రికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.
మొగల్తూరు పర్యటనలో సంక్షేమ పథకాల అమలును పరిశీలించడంతో పాటు, మత్స్యకారుల సమస్యలను నేరుగా తెలుసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




