Amaravati: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కీలక బిల్లులకు ఆమోదం!

Amaravati: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. దిశ చట్టం రద్దు, బీసీలకు 34% రిజర్వేషన్లు, మేయర్ల ప్రత్యక్ష ఎన్నికల బిల్లులపై ముమ్మర చర్చ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 13 Aug 2026 4:55 PM IST
Amaravati
X

Amaravati: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కీలక బిల్లులకు ఆమోదం!

Amaravati: ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. దిశ చట్టం ఉపసంహరణ, మహిళల భద్రతకు ప్రత్యామ్నాయ చట్టం, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, మున్సిపల్‌ మేయర్లు, చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.

దిశ చట్టానికి స్వస్తి.. కొత్త చట్టంపై కసరత్తు

గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది. దిశ చట్టంలోని కొన్ని నిబంధనలకు కేంద్ర చట్టాలతో, న్యాయపరమైన అంశాలతో అనుసంధానం లేకపోవడం వంటి కారణాలతో కేంద్రం చేసిన సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

దిశ చట్టాన్ని రద్దు చేసిన అనంతరం మహిళలు, బాలికల రక్షణకు మరింత సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించేలా కొత్త చట్టం తీసుకురావడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో మహిళల భద్రతకు మరింత పటిష్టమైన నిబంధనలు ఉండేలా కొత్త చట్టానికి రూపకల్పన చేసే అవకాశం ఉంది.

బీసీలకు 34 శాతం.. హామీ అమలుకు అడుగు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేసే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుతం స్థానిక సంస్థల్లో అమలవుతున్న రిజర్వేషన్లను సమీక్షించి.. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని 34 శాతానికి పెంచే అంశంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఇందుకోసం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్‌ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వివరాలు సేకరించింది. కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. అసెంబ్లీలో బిల్లు పెట్టే అవకాశం ఉంది.

ఈ బిల్లు అమల్లోకి వస్తే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

మేయర్‌, చైర్మన్‌ ఎన్నికల్లో కీలక మార్పు

మున్సిపల్‌ ఎన్నికల విధానంలోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ప్రస్తుతం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌లను ఎన్నికైన కౌన్సిలర్లు ఎన్నుకుంటున్నారు. ఇకపై ప్రజలే నేరుగా మేయర్‌, చైర్మన్‌ను ఎన్నుకునేలా మున్సిపల్‌ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి సంబంధించిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా మేయర్‌, చైర్మన్‌ పదవులకు ప్రజల నుంచి నేరుగా ఓట్లు పొందిన నేతలు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్థానిక సంస్థల్లో నాయకత్వానికి మరింత ప్రత్యక్ష ప్రజా మద్దతు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

స్థానిక ఎన్నికలకు ముందు మార్పులు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ చట్టపరమైన మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముందుగా మున్సిపల్‌ ఎన్నికలు, ఆ తర్వాత ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది.

మున్సిపల్‌ చట్ట సవరణలు పూర్తయి.. బిల్లులు చట్టరూపం దాల్చితే వచ్చే ఒకటి, రెండు నెలల్లో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

అంటే.. ఈ అసెంబ్లీ సమావేశాలు కేవలం శాసనపరమైన ప్రక్రియకే పరిమితం కాకుండా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపే కీలక నిర్ణయాలకు వేదిక కానున్నాయి. దిశ చట్టం ఉపసంహరణ నుంచి బీసీ రిజర్వేషన్ల పెంపు వరకు.. మేయర్‌, చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల నిర్వహణ వరకు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story