Nara Lokesh: అక్షర ఆంధ్రతో 82.1 శాతానికి పెరిగిన ఏపీ అక్షరాస్యత: నారా లోకేష్!
Nara Lokesh: కూటమి ప్రభుత్వ ‘అక్షర ఆంధ్ర’తో ఏపీ అక్షరాస్యత 82.1 శాతానికి చేరిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2027 సెప్టెంబర్ నాటికి 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
Nara Lokesh: అక్షర ఆంధ్రతో 82.1 శాతానికి పెరిగిన ఏపీ అక్షరాస్యత: నారా లోకేష్!
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు అందిస్తోంది. గత ఏడాది కాలంగా చేపట్టిన విస్తృత కార్యక్రమాలతో రాష్ట్రంలో 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర అక్షరాస్యత శాతం 82.1కి చేరింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్య రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. అక్షరాస్యత పెంపు, బడిబయట పిల్లల గుర్తింపు, విద్యార్థుల హాజరు, ఇంటర్మీడియట్ విద్యలో ఫలితాలు, తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయుల శిక్షణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
82.1 శాతానికి అక్షరాస్యత
2024 నాటికి రాష్ట్ర అక్షరాస్యత శాతం దేశంలోనే అత్యల్పంగా 72.6 శాతంగా ఉండేదని అధికారులు మంత్రికి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో చేపట్టడంతో ఒక్క ఏడాదిలోనే 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర అక్షరాస్యత 10 శాతం పెరిగి 82.1 శాతానికి చేరినట్లు చెప్పారు.
ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను అక్షరాస్యులుగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కృషిని అభినందించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పురోగతిపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన వారిని కూడా అక్షరాస్యులుగా మార్చేందుకు మరింత వేగంగా కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.
2027 సెప్టెంబర్ నాటికి నూరుశాతం
2027 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 25 లక్షల మందిని, సెప్టెంబర్ నాటికి మిగిలిన 27 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
అక్షర ఆంధ్ర కార్యక్రమం విజయవంతం కావాలంటే కేవలం విద్యాశాఖకే పరిమితం కాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఇప్పటికే 11 ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు వివరించారు.
ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
అక్షర ఆంధ్ర కార్యక్రమంలో శాసనసభ్యులు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. గ్రామస్థాయి నుంచి ప్రజలను చైతన్యవంతం చేసి, నిరక్షరాస్యులను గుర్తించి వారికి విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడానికే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచే సాధనంగా మారాలని సూచించారు.
ఇంటర్‌లో 10 వేల అడ్మిషన్లు పెరిగాయి
ఇంటర్మీడియట్ విద్యపైనా మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 10 వేల అడ్మిషన్లు పెరిగినట్లు చెప్పారు.
వెనుకబడిన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సంకల్ప్ అకడమిక్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా వారి ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.
తల్లికి వందనం ద్వారా రూ.1,051 కోట్ల సాయం
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటికే రూ.1,051 కోట్ల మేర ఆర్థిక సాయం అందించినట్లు అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా త్వరలో ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
విద్యార్థుల వివరాలు, విద్యా ప్రగతికి సంబంధించిన డిజిటల్ డేటా సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ నూరుశాతం అపార్ ఐడీ ఇంటిగ్రేషన్ పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
1.64 లక్షల మంది బడిబయట పిల్లలు
పాఠశాల విద్యపై సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఇంకా బడిబయట ఉన్న పిల్లలపై మంత్రి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,64,821 మంది పిల్లలు ఇప్పటికీ బడిబయట ఉన్నారని అధికారులు తెలిపారు. బడిఈడు పిల్లలందరినీ గుర్తించి, వారిని తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఈ ఏడాది ఇప్పటికే 33 వేల మంది బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. మిగిలిన పిల్లల వివరాలను కూడా లీప్ యాప్ ద్వారా సంబంధిత ప్రధానోపాధ్యాయులకు పంపించినట్లు చెప్పారు. పిల్లలను పాఠశాలలకు పంపేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.
విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల హాజరు గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల హాజరు 98.97 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. విద్యార్థుల హాజరు మాత్రం 85.41 శాతంగా ఉందని చెప్పారు.
విద్యార్థుల హాజరును మరింత పెంచేందుకు పాఠశాల స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఏదైనా విద్యార్థి వరుసగా మూడు రోజులపాటు పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి కారణాలను తెలుసుకోవడంతో పాటు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ బాధ్యతలను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు కూడా అప్పగించాలని సూచించారు.
ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణ
విద్యాబోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని మంత్రి లోకేష్ సూచించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు విజయవంతం కావడంపై ఉపాధ్యాయులు, అధికారులను మంత్రి అభినందించారు.
ఏఐ సమర్థ్ ఇనిషియేటివ్ ద్వారా ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఏఐ ఆధారిత సాధనాలను విద్యాబోధనలో సమర్థంగా వినియోగించేలా ఉపాధ్యాయులను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.
పదో తరగతిపై మిషన్ మార్చి
ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించనున్న మిషన్ మార్చి-2026 కార్యక్రమంపైనా సమావేశంలో సమీక్ష జరిగింది. విద్యార్థులలో పరీక్షలపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ, మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు తప్పనిసరిగా నిర్వహించాల్సిన స్పెషల్ టెట్ నిర్వహణపైనా చర్చించారు. ఉపాధ్యాయులకు అవసరమైన మార్గదర్శకాలు, శిక్షణ, పరీక్షా ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సెప్టెంబర్ 5న 192 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్రవ్యాప్తంగా 192 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజనంపై ఫీడ్‌బ్యాక్ తప్పనిసరి
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను లీప్ యాప్ ద్వారా అందించాలని మంత్రి కోరారు. క్షేత్రస్థాయిలో వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా లోపాలను వెంటనే సరిదిద్దే వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
విద్యార్థుల మనోవికాసానికి ప్రాధాన్యం
విద్యార్థుల్లో మనోవికాసం పెంపొందించడంతో పాటు ఒత్తిడిలేని అభ్యసన వాతావరణాన్ని కల్పించడంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. మార్కులు, పరీక్షలకే విద్యను పరిమితం చేయకుండా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పెంపొందించేలా బోధన సాగాలని అన్నారు.
125 కేంద్రాల్లో ఆటిజం సెంటర్లు
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మెరుగైన విద్య, సహాయక సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 125 కేంద్రాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను ప్రధాన విద్యా వ్యవస్థలో భాగస్వాములను చేసేలా అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు.
సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, పాఠశాల విద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




