అమరావతిలో పీఎన్‌బీ క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్..

Amaravati: అమరావతిలో దేశీయ బ్యాంకింగ్ రంగంలో తొలిసారిగా క్వాంటం ఫైనాన్స్ హబ్ ఏర్పాటుకు పీఎన్‌బీతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 23 July 2026 8:17 PM IST
Amaravati
X

అమరావతిలో పీఎన్‌బీ క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్..

అమరావతి: అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో తొలిసారిగా క్వాంటం టెక్నాలజీ ఆధారిత క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ముందుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ క్వాంటం మిషన్, పీఎన్‌బీ మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. పీఎన్‌బీ సీఈఓ, ఎండీ అశోక్ చంద్ర ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

ఈ హబ్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయడం, ఆర్థిక మోసాలను ముందుగానే గుర్తించే అధునాతన వ్యవస్థలను అభివృద్ధి చేయడం, భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన సురక్షిత సాంకేతిక పరిష్కారాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఈ కేంద్రం దోహదపడనుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని క్వాంటం, డీప్ టెక్నాలజీలకు జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో పీఎన్‌బీ భాగస్వామ్యం మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంపు అత్యవసరమని, డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, బ్యాంకులు కలిసి పనిచేయాలని సూచించారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా డిజిటల్ లావాదేవీలకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

పీఎన్‌బీ సీఈఓ అశోక్ చంద్ర మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత సురక్షితంగా, వేగవంతంగా, ప్రజలకు సులభంగా అందించే దిశగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఎన్‌బీ ఉన్నతాధికారులు, అమరావతి క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story