Amaravati: రాజధానిలో ఏడుచోట్ల ఎనర్జీ స్టేషన్లు!

Amaravati: రాజధాని అమరావతిని పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు CRDA 7 ప్రాంతాల్లో సమీకృత ఎనర్జీ స్టేషన్లకు టెండర్లు ఆహ్వానించింది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Aug 2026 10:15 AM IST
Amaravati
X

Amaravati: రాజధానిలో ఏడుచోట్ల ఎనర్జీ స్టేషన్లు!

Amaravati: రాజధాని అమరావతిని ఆధునిక, పర్యావరణహిత నగరంగా అభివృద్ధి చేసే క్రమంలో విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని పరిధిలో ఏడుచోట్ల సమీకృత ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సీఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎనర్జీ స్టేషన్లను బహుళ ప్రయోజన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుకు మొత్తం 18.25 ఎకరాల భూమిని కేటాయించారు. అనంతవరంలో ఒకటి, కురగల్లులో మూడు, నేలపాడులో రెండు, వెలగపూడిలో ఒకటి చొప్పున మొత్తం ఏడు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. అమరావతి రోడ్డు నెట్‌వర్క్‌లో పౌర సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు టెండర్‌ పత్రాల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఛార్జింగ్‌ మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎనర్జీ స్టేషన్లను రూపొందించనున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌తో పాటు భవిష్యత్‌లో పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ వంటి ఇంధన సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. రిటైల్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌, వెల్‌నెస్‌ వంటి వాణిజ్య, పౌర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

రాజధాని పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సచివాలయం, శాసనసభ, న్యాయవ్యవస్థకు అనుబంధంగా పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల వాహనాలకు ఈ ఎనర్జీ స్టేషన్లు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. అమరావతి ప్రధాన ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్ల వెంట ప్రతి ఒక్కరికీ సులభంగా చేరుకునే విధంగా వీటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

జాతీయ విద్యుత్‌ వాహన మొబిలిటీ ప్రాజెక్టులో భాగంగా అమరావతిని ప్రయోగాత్మక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్‌లో హైడ్రోజన్‌ ఆధారిత వాహనాల వినియోగం పెరిగితే, వాటికి ఇంధనం నింపే కేంద్రాలుగా మార్చుకునే విధంగా మౌలిక వసతులను రూపొందించనున్నారు. అంటే ప్రస్తుత అవసరాలకు మాత్రమే కాకుండా, రాబోయే దశాబ్దాల రవాణా మార్పులకు అనుగుణంగా ఎనర్జీ స్టేషన్లను సిద్ధం చేయనున్నారు.

ఈ ప్రాజెక్టును డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBFOT) విధానంలో చేపట్టనున్నారు. తొలుత 33 ఏళ్ల కాలపరిమితికి ప్రాజెక్టును అప్పగించనుండగా, అవసరాన్ని బట్టి మరో 33 ఏళ్లపాటు పొడిగించే అవకాశం కల్పించారు. ఒక సంస్థకు గరిష్ఠంగా మూడు ఎనర్జీ స్టేషన్లు మాత్రమే కేటాయించనున్నట్లు టెండర్‌ నిబంధనల్లో స్పష్టం చేశారు.

భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించడంతో పాటు, వార్షిక లీజు అద్దె, ఇంధన మరియు ఇంధనేతర కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంపై నిర్దిష్ట శాతం కమీషన్‌ చెల్లించే విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో అమరావతిలో విద్యుత్‌ వాహనాల వినియోగానికి అవసరమైన మౌలిక వసతులు పెరగడంతో పాటు, ఒకే ప్రాంగణంలో రవాణా, వాణిజ్య, వినోద, ఆరోగ్య సంబంధిత సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

భవిష్యత్‌ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఈ ఏడుచోట్ల ఎనర్జీ స్టేషన్లు రాజధాని ఆధునిక మౌలిక వసతుల్లో కీలక భాగంగా మారనున్నాయి.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story