అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై సీఐడీ డీజీపీకి వినతి

Amaravati: అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయం, బాధితుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళగిరి సీఐడీ కార్యాలయంలో డీజీపీ రవిశంకర్ అయ్యనార్‌ను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 Aug 2026 6:36 PM IST
Amaravati
X

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై సీఐడీ డీజీపీకి వినతి

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని కోరుతూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యనార్‌ను కలిశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కె. నారాయణరావు ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో డీజీపీతో సమావేశమైన ప్రతినిధులు.. బాధితుల సమస్యలపై పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

రాజధాని సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఎకరాల ప్రాతిపదికన కాకుండా.. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా గజాల లెక్కన విక్రయించాలని అసోసియేషన్ కోరింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ భవనాలను కూడా స్క్వేర్ ఫీట్ ప్రాతిపదికన మార్కెట్ ధరలకు విక్రయించాలని విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం ద్వారా సంస్థ ఆస్తులకు గరిష్ట ధర లభించడంతో పాటు.. బాధితులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ప్రతినిధులు వివరించారు.

ఇక ఇతర ప్రాంతాల్లోని అగ్రిగోల్డ్ ఆస్తులను జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించిన ధరను ప్రామాణికంగా తీసుకుని.. పూర్తి పారదర్శకతతో విక్రయించాలని కోరారు. ఆస్తుల విక్రయ ప్రక్రియలో పారదర్శకత పాటించి, సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని సమీకరించడం ద్వారా బాధితులకు త్వరగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అగ్రిగోల్డ్ సమస్యను తమ సొంత సమస్యగా భావించి ఆరు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై సమస్య పరిష్కారంపై చర్చిస్తున్న సబ్‌కమిటీ మంత్రులు, సీఐడీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

అసోసియేషన్ ప్రతిపాదనలపై సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యనార్ సానుకూలంగా స్పందించారు. ప్రతినిధులు చేసిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అసోసియేషన్ ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story