Gudihatnoor: గుడిహత్నూర్ హైవేపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Gudihatnoor: గుడిహత్నూర్ జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. నిలిచిపోయిన పనులు, వాహనాల బ్రేక్ డౌన్‌తో ప్రయాణికుల తీవ్ర అవస్థలు.
Gudihatnoor: గుడిహత్నూర్ హైవేపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Gudihatnoor: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారి పనులు మధ్యలోనే ఆగిపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
హైవే పనులు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డు మీదుగా మళ్లించగా, ఈ ఇరుకైన మార్గంలో భారీ లోడుతో వెళ్లే లారీలు ముఖ్యంగా తరచూ బ్రేక్ డౌన్ అవుతుండటమే ఈ భారీ ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణమైంది. సర్వీస్ రోడ్డుపై సరిపడా స్థలం లేకపోవడం, అదే సమయంలో భారీ వాహనాలు మొరాయించి నిలిచిపోవడంతో ఇతర వాహనాలు ముందుకు కదిలే మార్గం లేక గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి.
దీనికితోడు డోంగ్రగావ్ నుండి గుడిహత్నూర్ బస్టాండ్ వరకు, అటు కుప్తి వంతెన సమీపంలోనూ వన్-వే అమలు చేస్తుండటంతో సమస్య మరింత జటిలమైంది. ఒక్క వాహనం కాస్త ముందుకు కదలాలన్నా అరగంటకు పైగా పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సర్వీస్ రోడ్డుపై నిలిచిపోయే భారీ వాహనాలను వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయడంతో పాటు, ఆగిపోయిన హైవే పనులను పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




