Gudihatnur: ప్రయాణికుల కోసం బస్టాండ్ వద్ద తాత్కాలిక టెంట్ ఏర్పాటు
Gudihatnur: hmtv కథనానికి స్పందించిన గ్రామ పంచాయతీ నిర్మల్ బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోసం తాత్కాలిక టెంట్ షెల్టర్ ఏర్పాటు చేసింది.
Gudihatnur
Gudihatnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని నిర్మల్ బస్టాండ్ వద్ద ప్రయాణికుల నీడ కోసం సాగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు పడుతున్న అవస్థలపై hmtv గతంలో కథనాలను ప్రచురించి, క్షేత్రస్థాయిలో ఉన్న దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
నిజానికి ఇక్కడ షెల్టర్ నిర్మించాల్సిన నేషనల్ హైవే అథారిటీ (NHAI) వారికి గ్రామ పంచాయతీ పాలకవర్గం వందల సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు, ఎండల తీవ్రత మరోవైపు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో స్పందించిన గుడిహత్నూర్ సర్పంచ్ ఆడే షీలా, ఉపసర్పంచ్ నిఖిల్ మరియు వార్డు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైవే అధికారులు పట్టించుకోకపోయినా, ప్రజల కష్టాలు చూడలేక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే ఈరోజు అక్కడ తాత్కాలిక టెంట్ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు.
నిత్యం గంటల తరబడి భానుడి సెగలకు అల్లాడిపోతున్న ప్రయాణికులకు ఈ తాత్కాలిక షెల్టర్ పెద్ద ఊరటనిస్తోంది. తమ సమస్యను వెలుగులోకి తెచ్చిన hmtv కి, వార్తలకు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టిన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత బస్ షెల్టర్ నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.




