Gudihatnoor: అనుమతి లేని నర్సరీలపై కఠిన చర్యలు హెచ్చరిక!
Gudihatnoor: గుడిహత్నూర్‌లో అనుమతి లేని కూరగాయ నర్సరీలపై కఠిన చర్యలు. లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేస్తామని ఉద్యాన శాఖ విస్తరణ అధికారి శేఖర్ హెచ్చరిక.
Gudihatnoor: అనుమతి లేని నర్సరీలపై కఠిన చర్యలు హెచ్చరిక!
Gudihatnoor: గుడిహత్నూర్ మండల పరిధిలో అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కూరగాయ నారు నర్సరీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉద్యాన శాఖ విస్తరణ అధికారి ఆడేపు శేఖర్ హెచ్చరించారు.
మండల పరిధిలోని పలు కూరగాయ నర్సరీలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా నర్సరీలను నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని, అలాగే పాత నర్సరీల లైసెన్స్‌లతో కొత్తగా నర్సరీలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కొత్తగా కూరగాయ నర్సరీలను ప్రారంభించదలచిన యజమానులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, గ్రామ పంచాయతీ ఆమోద పత్రం, మట్టి మరియు నీటి పరీక్ష నివేదికలతో పాటు సంబంధిత రైతు అగ్రిమెంట్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి స్థానిక ఉద్యాన శాఖ విస్తరణ అధికారికి లేదా జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో అందజేయాలని, అనంతరం బ్యాంకులో నిర్ణీత రుసుము చెల్లించి అధికారిక లైసెన్స్ పొందాలని సూచించారు.
ఇప్పటికే కొనసాగుతున్న పాత నర్సరీల యజమానులు కూడా రెన్యువల్ దరఖాస్తు ఫారం, అగ్రిమెంట్ కాపీ, ఆధార్ కార్డు, బ్యాంకు చలానా రసీదులను సమర్పించి తమ లైసెన్స్‌లను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా లైసెన్సులు పొందని, రెన్యువల్ చేసుకోని నర్సరీలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.




