Nirmal: పాండాపూర్ చెక్ పోస్ట్ వద్ద అటవీ అధికారుల తీరుపై ప్రజల తీవ్ర ఆగ్రహం!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం పాండాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్‌లో ప్రయాణించినా అటవీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
Nirmal: పాండాపూర్ చెక్ పోస్ట్ వద్ద అటవీ అధికారుల తీరుపై ప్రజల తీవ్ర ఆగ్రహం!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండాపూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద అటవీ అధికారుల ద్వంద్వ విధానాలపై స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ స్పెషల్ ఎంట్రీ పేరుతో సామాన్యుల నుంచి నిబంధనల ప్రకారం టోల్ వసూలు చేస్తున్న అధికారులు.. ప్రభుత్వ వాహనాల నిబంధనల ఉల్లంఘనలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్ జిల్లా కడెం మండల పరిధిలోని పాండాపూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం ఉదయం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి ప్రవేశించే సామాన్య వాహనదారులందరినీ నిలిపివేసి, ప్రత్యేక ఎంట్రీ ఫీజులు వసూలు చేసే అటవీ శాఖ అధికారులు.. ఆర్టీసీ బస్సు విషయంలో మాత్రం చేతులు ముడుచుకుని కూర్చున్నారు.టోల్ ప్లాజా మీదుగా వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసింది.
చెక్ పోస్ట్ నియమాలకు విరుద్ధంగా, రోడ్డుకు కుడివైపున ఉన్న ఖాళీ స్థలం గుండా రాంగ్ రూట్‌లో దూసుకొచ్చింది. ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిసినా డ్రైవర్ బస్సును అలానే ముందుకు పోనిచ్చాడు.కళ్లెదుటే ఇంత పెద్ద ప్రమాదకర ఉల్లంఘన జరుగుతున్నా, అక్కడ విధుల్లో ఉన్న అటవీ అధికారులు కనీసం బస్సును ఆపకపోవడం, హెచ్చరించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు కేవలం సామాన్య ప్రజలకే వర్తిస్తాయా? ఆర్టీసీ బస్సులకు, ప్రభుత్వ వాహనాలకు వర్తించవా? అంటూ వాహనదారులు అటవీ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు."




