Bellampalli: బెల్లంపల్లిలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో!
Bellampalli: జిఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బెల్లంపల్లిలో పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ రాస్తారోకో, ర్యాలీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం.
Bellampalli: బెల్లంపల్లిలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో!
Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కదం తొక్కారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 97 ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోని ఐటీఐ వ్యవస్థలో విలీనం చేయాలని చూస్తోందని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున రాస్తారోకో, నిరసన ర్యాలీ నిర్వహించారు.
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుండి బజార్ ఏరియా మీదుగా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు బడికల శ్రావణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు.
పాలిటెక్నిక్ కళాశాలలను ఈ విధంగా విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్య ప్రమాణాలు పడిపోయి, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులు పాలిటెక్నిక్ పూర్తి చేసి, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత స్థాయి అధికారుల హోదాలో స్థిరపడ్డారని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వివాదాస్పద నిర్ణయం వల్ల విద్యార్థులు నైపుణ్యాలను కోల్పోయి, చివరకు కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
నిరుద్యోగ యువత, విద్యార్థుల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించవద్దని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే జీవో నంబర్ 97ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




