Boath: బోథ్ నియోజకవర్గంలో పీఏసీఎస్ పదవుల కోసం ఆశావహుల పోటీ!
Boath: బోథ్ నియోజకవర్గంలో పీఏసీఎస్ పాలకవర్గాల నియామకాలకు కసరత్తు. చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ నాయకుల ముమ్మర ప్రయత్నాలు.
Boath: బోథ్ నియోజకవర్గంలో పీఏసీఎస్ పదవుల కోసం ఆశావహుల పోటీ!
Boath: ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల భర్తీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో గ్రామీణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
గతంలో పదవీకాలం ముగిసిన పాలకవర్గాల స్థానంలో, సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ లేదా ఎన్నికలు జరిగే వరకు ఆరు నెలల కాలపరిమితితో 'నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్' (పీఐసీ) కమిటీలను నామినేటెడ్ పద్ధతిలో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) తరహాలోనే స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సిఫారసుల ఆధారంగానే ఈ నియామకాలు చేపట్టే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బోథ్ నియోజకవర్గ పరిధిలోని పలు పీఏసీఎస్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పీఏసీఎస్‌ల వారీగా ఆశావహులు, పరిశీలనలో ఉన్న పేర్లు:
నేరడిగొండ: ఇక్కడ పీఏసీఎస్ పీఠం కోసం పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్‌కు సన్నిహితుడైన నారాయణ్ సింగ్ పేరు ప్రధాన పరిశీలనలో ఉండగా, ఆయనతో పాటు మాజీ సర్పంచ్ ఆడే వసంత్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇచ్చోడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుంట ప్రవణ్ రెడ్డి ముందంజలో ఉన్నట్లు తెలుస్తుండగా, ప్రస్తుత కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు భీమ్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. ముగ్గురు కీలక నేతల పేర్లూ పరిశీలనలో ఉండటంతో తుది ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గుడిహత్నూర్ & మన్నూర్: గుడిహత్నూర్ పీఏసీఎస్ చైర్మన్ పీఠం కోసం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు యువ నాయకుడు అంకతి రవీందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ క్షేత్రస్థాయిలో పట్టున్న ఆయనకే మొదటి ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నట్లు సమాచారం.
మరోవైపు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నాగ్నాథ్ అప్ప కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే మండల పరిధిలోని మన్నూర్ పీఏసీఎస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గణేష్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లేనని సమాచారం.
బజార్‌హత్నూర్: పార్టీ సీనియర్ నాయకులు భూమయ్య, దేవేందర్‌ల పేర్లు ముందంజలో ఉన్నాయి. వీరితో పాటు మరో సీనియర్ నేత శివుడు కూడా పదవిని ఆశిస్తున్నారు.
బోథ్: మండల కేంద్రం పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం శ్రీకాంత్ రెడ్డి, సాయన్న, షామెందర్ ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ, పంట రుణాల మంజూరు, ధాన్యం కొనుగోళ్లలో పీఏసీఎస్‌లు అత్యంత కీలకమైనందున, గ్రామాల్లో పార్టీకి బలంగా నిలబడే సమర్థులైన నేతలకే ప్రభుత్వం నామినేటెడ్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పీఐసీ కమిటీల నియామక ఉత్తర్వులు వెలువడుతుండటంతో, బోథ్ నియోజకవర్గ కమిటీలపై అతి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.




