Bazarhatnoor: బజార్‌హత్నూర్ ఎక్స్‌పైరీ మాత్రలతో గర్భిణికి అస్వస్థత
Bazarhatnoor: ఎక్స్‌పైరీ మాత్రలు ఇవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురైన గర్భిణి. బజార్‌హత్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితుల నిరసన, సిబ్బంది బుకాయింపు.
Bazarhatnoor: బజార్‌హత్నూర్ ఎక్స్‌పైరీ మాత్రలతో గర్భిణికి అస్వస్థత
బజార్‌హత్నూర్: ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఒక గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చింది. ఎక్స్‌పైరీ అయిపోయిన మాత్రలు ఇవ్వడం వల్ల ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో కలకలం రేపింది. స్థానికంగా నివసించే ఓ మహిళకు ఇటీవల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. పరీక్షలు పూర్తి చేసిన వైద్య సిబ్బంది ఆమెకు ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందజేశారు.
అయితే, ఆసుపత్రిలో ఇచ్చిన మాత్రలను వేసుకున్న కొద్దిసేపటికే సదరు గర్భిణికి తీవ్రంగా రక్తస్రావం కావడం మొదలైంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ దారుణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి అక్కడి సిబ్బందిని నిలదీశారు. అయితే, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సిబ్బంది "ఆ మాత్రలు మా ఆసుపత్రికి చెందినవి కావు" అంటూ సమాధానం చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా, సదరు ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన ఫార్మసిస్ట్ తరచూ డ్యూటీకి సరిగ్గా హాజరుకావడం లేదని, ఇలాంటి నిర్లక్ష్యాల వల్లే రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు.




