Adilabad: మిస్టరీగా మారిన ప్రభుత్వ వైద్యుడి కారు ప్రమాదం
Adilabad: గుడిహత్నూర్ సమీపంలో ప్రభుత్వ వైద్యుడి కారు ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తుండగా ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దొంగ్రగావ్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్‌కు చెందిన ఒక ప్రభుత్వ వైద్యుడి కారు డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా ధ్వంసమైనప్పటికీ, ఎయిర్ బ్యాగులు సకాలంలో తెరుచుకోవడంతో ఆయన ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. వెనుక నుండి ఏదో భారీ వాహనం ఢీకొట్టిందని పోలీసులు భావిస్తున్నప్పటికీ, కారు వెనుక భాగం చెక్కుచెదరకుండా కేవలం ముందు భాగం మాత్రమే నుజ్జునుజ్జు కావడం మిస్టరీగా మారింది.
ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఎంతో కీలకమైన నిఘా నేత్రాలు(CC Camera) లు పనిచేయకపోవడం వల్ల ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు తెలియడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
మరోవైపు ఈ వాహనంపై 2023 నుండి ఇప్పటివరకు 12 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉండగా, అందులో 10 చలాన్లు కేవలం అతివేగం మరియు ప్రమాదకర డ్రైవింగ్‌కు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రైవేట్ రిజిస్ట్రేషన్ వాహనంపై నిబంధనలకు విరుద్ధంగా 'ON Govt Duty' అని రాసి ఉండటం కూడా వివాదానికి దారితీస్తోంది. పాత రికార్డులను బట్టి చూస్తే అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. ప్రాణనష్టం జరగకపోయినా, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి నిబంధనలు ఉల్లంఘించడంపై విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.




