Mancherial: పచ్చదనంతోనే సమతుల్య వాతావరణం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్!
Mancherial: మంచిర్యాల జిల్లా మందమర్రి బొక్కలగుట్ట గాంధారి వనంలో కలెక్టర్ కుమార్ దీపక్ మొక్కలు నాటారు. అనంతరం అర్హులైన పేదలకు 2BHK ఇళ్ల లక్కీ డ్రాని నిర్వహించారు.
Mancherial: పచ్చదనంతోనే సమతుల్య వాతావరణం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్!
Mancherial: మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి సమతుల్య వాతావరణాన్ని నిర్మించవచ్చని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి వనంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. చెట్ల ద్వారా సహజవాయువు, ఆరోగ్యకరమైన ఆహారం, ఆశ్రయం లభించడంతో పాటు వర్షపాతం సమృద్ధిగా ఉంటుందని తెలిపారు.
మంగళవారం జిల్లాలో 4 లక్షల మొక్కలు నాటినట్లు, జిల్లాకు నిర్దేశించిన 41 లక్షల మొక్కల లక్ష్యంలో దాదాపు 80 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. భావితరాలకు సహజమైన, సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.
అనంతరం మందమర్రి మండల కేంద్రంలోని ఆర్‌కే గార్డెన్స్‌లో నిర్వహించిన రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల లక్కీ డ్రా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు చేపట్టేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం నిరుపేదలకు సొంత గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా లక్కీ డ్రా పద్ధతిలో పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో డీసీపీ ఏ.భాస్కర్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




