Khanapur: ఖానాపూర్‌లో గణేష్ ఉత్సవాల శాంతి కమిటీ సమావేశం!

Khanapur: ఖానాపూర్‌లో గణేష్ ఉత్సవాలపై పోలీస్ శాంతి కమిటీ సమావేశం. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశం.

RAKESH N, KHANAPUR
Published on: 12 Sept 2026 2:15 PM IST
Khanapur
X

Khanapur: ఖానాపూర్‌లో గణేష్ ఉత్సవాల శాంతి కమిటీ సమావేశం!

Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు.. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణే ధ్యేయంగా ఈ సమావేశం జరిగింది. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ఖానాపూర్‌లోని సీఎం రావు ఫంక్షన్ హాల్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో నవరాత్రి ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు.

ఉత్సవ కమిటీ సభ్యులు కూడా తమకు కావాల్సిన అవసరాలను, స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.

ఈ శాంతి కమిటీ సమావేశంలో నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్‌తో పాటు ఖానాపూర్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఖానాపూర్ ఎస్‌ఐ రాహుల్, కడెం ఎస్‌ఐ సాయి కుమార్, ఏఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR