Ichoda: ఇచ్చోడ డిగ్రీ కాలేజీలో జూనియర్లకు హారతులతో ఘన స్వాగతం!

Ichoda: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినూత్న స్వాగతోత్సవం. మొదటి రోజు ప్రవేశించిన విద్యార్థులకు హారతులు, పుష్పగుచ్ఛాలతో ఆహ్వానం.

NAGULA SATISH, BOATH
Published on: 7 July 2026 8:23 AM IST
Ichoda
X

Ichoda: ఇచ్చోడ డిగ్రీ కాలేజీలో జూనియర్లకు హారతులతో ఘన స్వాగతం!

ఇచ్చోడ: సాధారణంగా కాలేజీ మొదటి రోజు అనగానే విద్యార్థుల్లో ఏదో తెలియని కంగారు, సీనియర్ల ర్యాగింగ్ భయం, కొత్త వాతావరణంలో ఎలా ఒదిగిపోతామో అన్న ఆందోళన ఉంటాయి. కానీ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సోమవారం నాడు క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరం విద్యార్థులకు అక్కడ ఎదురైన అనుభవం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది.

​కళాశాల ప్రవేశ ద్వారం వద్దే ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లెక్చరర్లు, సీనియర్ విద్యార్థులు అంతా ఒక కుటుంబంలా చేరి కొత్తగా చేరిన జూనియర్లకు పుష్పగుచ్ఛాలు ఇస్తూ, సాంప్రదాయబద్ధంగా హారతులు పాడుతూ సాదరంగా లోపలికి ఆహ్వానించారు.

ఈ వినూత్న స్వాగతం చూసి కొత్త విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆనందానికి లోనయ్యారు. ఇలాంటి ఘన స్వాగతాన్ని తాము అస్సలు ఊహించలేదని, ఈ కాలేజీలో సీటు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు మురిసిపోతు తమ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. నమ్మకంతో ఈ కాలేజీని ఎంచుకున్న విద్యార్థులను అభినందించారు. ఇక్కడి అనుభవజ్ఞులైన అధ్యాపకులు విద్యార్థుల అభ్యున్నతికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం వివిధ విభాగాల లెక్చరర్లు తమ సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తూ, ప్రతిరోజూ కాలేజీకి హాజరు కావడం ద్వారా అద్భుతమైన విషయ పరిజ్ఞానాన్ని సాధించవచ్చని దిశానిర్దేశం చేశారు.

ఈ ఆత్మీయ స్వాగతోత్సవంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సరస్వతితో పాటు కోఆర్డినేటర్లు డాక్టర్ కె మురళి, డాక్టర్ అనిత, ప్రభాత్ రావు, విజయకుమార్, డి దయాకర్, డాక్టర్ జె తిరుపతి, వి సరిత రాణి, టి నర్సయ్య, అధ్యాపకులు సుభాష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొని విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story