Asifabad: కొమురం భీం జిల్లాలో భారీ వర్షాల బీభత్సం స్తంభించిన జనజీవనం!
Asifabad: కొమురం భీం జిల్లాలో భారీ వర్షాల బీభత్సంతో జనజీవనం స్తంభించింది.
Asifabad: కొమురం భీం జిల్లాలో భారీ వర్షాల బీభత్సం స్తంభించిన జనజీవనం!
Asifabad: కొమురం భీం జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్ మండలంలో కృష్ణపల్లి ఒర్రె ఉప్పొంగి ప్రవహించడంతో సుస్మీర్, సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ సహా సుమారు 12 గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ప్రజలు గ్రామాలకే పరిమితమయ్యారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని, కృష్ణపల్లి ఒర్రెపై శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామస్థులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కోరుతున్నారు.
చింతలమానేపల్లి మండలంలో దిందా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో దిందా, కేతిని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బాబాసాగర్ వాగు వరద ఉధృతికి నాయకపుగూడ గ్రామానికి వెళ్లే మార్గం మూసుకుపోయి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.
తిర్యాణి మండలం ఏడులపాడు గ్రామంలోని రోళ్ల వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం లేక పశువుల కాపరులు ఎడ్లతో కలిసి నీటి ప్రవాహంలోనే వాగును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలకు ముప్పు ఉన్నా నిత్యావసరాల కోసం ఇదే దారిని వినియోగిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు. అవసరం లేకుండా పిల్లలను బయటకు పంపవద్దని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు, వంకలు, కల్వర్టులను దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు.




