Nirmal: నిర్మల్ కౌన్సిల్ భేటీలో వాడీవేడి చర్చ
Nirmal: నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే వైఖరిపై కౌన్సిలర్లు మండిపడ్డారు.
Nirmal: నిర్మల్ కౌన్సిల్ భేటీలో వాడీవేడి చర్చ
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వాగ్వాదాల మధ్య జరిగింది. పట్టణ అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే వైఖరిపై పలువురు కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ అభివృద్ధి పనుల సమీక్ష పేరిట అధికారులను బీజేపీ కార్యకర్తల సమక్షంలో అవమానించడం తగదని సభ్యులు మండిపడ్డారు.
అధికారులు ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారే కావడం వల్లే ఈ విధంగా వ్యవహరించారా ,అగ్రవర్ణాలకు చెందిన అధికారులు ఉంటే కూడా ఇదే విధంగా వ్యవహరించేవారా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని, అధికారులను అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదని కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించాలని సూచించారు.
వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని సభ్యులు సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ సమీక్ష సమావేశాల పేరుతో బిజెపి కార్యకర్తల సమక్షంలో మున్సిపల్ అధికారులను నిలదీయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే హోదాలో మునిసిపల్ కార్యాలయానికి వచ్చి తమకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి అధికారులను చిన్న చూపు చూసేలా వ్యవహరించడం మానుకోవాలన్నారు. మున్సిపాలిటీ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే కార్యాలయానికి వచ్చి తెలుసుకోవచ్చని సూచించారు.




