Gudihatnur: గుడిహత్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత
Gudihatnur: గుడిహత్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో తీవ్ర సిబ్బంది కొరత. అధికారులపై పనిభారం, నిలిచిన భూ సర్వే పనులు. పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని ప్రజల డిమాండ్.
Gudihatnur: గుడిహత్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రమవడంతో తహసీల్దార్ కవితా రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లపై తీవ్రమైన పనిభారం పడుతోంది. మండలంలో రెవెన్యూ ఫైళ్లు పెండింగ్‌లో పడకుండా ఉండేందుకు ఉన్నతాధికారులే స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయి విచారణలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ వ్యవస్థలో జీపీఓ మొదలుకొని ఎంఆర్ఐ, డీటీ మీదుగా తహసీల్దార్ వరకు ఒక క్రమపద్ధతిలో పనులు జరగాల్సి ఉండగా, కింది స్థాయిలో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారికి సరైన పనితీరు రాకపోవడంతో ఆ అదనపు భారమంతా తమపైనే పడుతోందని ఆమె పేర్కొన్నారు. మండలంలో 9 మంది జీపీఓలు ఉండగా వారిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారికి క్షేత్రస్థాయికి వెళ్లి సరైన రీతిలో విధులు నిర్వర్తించడం రాకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్థాయిలో వారి పనులను పర్యవేక్షించి నివేదికలు ఇవ్వాల్సిన మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఎంఆర్ఐ) నెల రోజులుగా అనారోగ్యంతో సెలవులో ఉన్నారు. తాజాగా ఆయన మరో 15 రోజుల పాటు సెలవు పొడిగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు దింతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. దీనికితోడు ఇటీవల గుడిహత్నూర్‌కు కేటాయించిన ముగ్గురు సర్వేయర్లను ఆదిలాబాద్ విమానాశ్రయ భూముల సర్వేకు పంపించడంతో ఇక్కడ భూ సర్వే పనులన్నీ పూర్తిగా నిలిచిపోయాయి.
కార్యాలయంలో ఉన్న ముగ్గురు అటెండర్లలో ఒక్కరే విధుల్లో ఉండటంతో పాలన కుంటుపడి ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.




