Gudihatnoor: కాగితాల్లోనే ఇల్లు... ఆదివాసీ దంపతుల పోరాటం!
Gudihatnoor: గుడిహత్నూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అధికారుల నిర్వాకం. కాగితాల్లో ఇల్లు ఉన్నా ఆదివాసీ దంపతులకు అన్యాయం జరిగిన ఘటన వివరాలు ఇవే.
Gudihatnoor: కాగితాల్లోనే ఇల్లు... ఆదివాసీ దంపతుల పోరాటం!
గుడిహత్నూర్: పుట్టిల్లు దాటి మెట్టినింట అడుగుపెట్టి పదేళ్లవుతోంది. తలదాచుకోవడానికి సొంత ఇల్లు లేక, వానొస్తే కారే కప్పు కింద, చలికి వణికిపోతూ కాలం వెళ్లదీస్తోంది ఆ ఆదివాసీ గృహిణి. కాస్త నీడ కల్పించమని ప్రభుత్వాన్ని వేడుకుంటే... "నీకు ఎప్పుడో ఇల్లు ఇచ్చేశాం కదా!" అంటూ అధికారులు ఇచ్చిన సమాధానం విని ఆ దంపతుల గుండె ఘల్లుమంది. కనీసం కట్టె కూడా నాటని చోట, రూపాయి సాయం అందని స్థితిలో తమ పేరిట ఇల్లు మంజూరై నిధులు కూడా జమ అయినట్లు ఆన్‌లైన్ రికార్డులు చూపిస్తుండటంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
గుడిహత్నూర్ మండలం జవహర్ నగర్‌కు చెందిన హీరకుమ్ర లక్ష్మి, బాపురావు దంపతుల దీనగాథ ఇది. లక్ష్మి పుట్టిల్లు తలమడుగు మండలం పల్లి గ్రామం. 1996లో జన్మించిన లక్ష్మికి 2016లో బాపురావుతో వివాహమైంది. ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం ఆశగా దరఖాస్తు చేసుకున్న లక్ష్మికి ఆన్‌లైన్ పోర్టల్‌ను చూడగానే కోలుకోలేని షాక్ తగిలింది. ఆన్‌లైన్ వివరాల్లో బెనిఫిషియరీ ఐడీ: 192420115P3554342 పేరిట ఇదివరకే ఇల్లు మంజూరై, ఏకంగా ₹51,200 నిధులు కూడా విడుదలైనట్లు నమోదై ఉంది. ప్రస్తుతం ఈ దరఖాస్తు ఆన్‌లైన్ పోర్టల్‌లో L3 (List-3) లో పెండింగ్‌లో చూపిస్తోంది.
ఇక్కడే అధికారుల అక్రమాల గుట్టు రట్టవుతోంది. లక్ష్మికి 2016లో వివాహం కాగా, ఆ సమయానికి ఆమెకు కనీసం పూర్తి స్థాయి అవగాహన కూడా లేని వయసు. లక్ష్మికి పెళ్లి కాకముందే ఆమె రేషన్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసి అప్పటి హౌసింగ్ అధికారులు, సిబ్బంది ఈ అక్రమానికి తెరలేపినట్లు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగితాల్లో ఇల్లు కట్టేసి, నిధులు దారి మళ్లించిన అధికారుల నిర్వాకానికి ఇప్పుడు ఒక పేద ఆదివాసీ కుటుంబం నిలువునా బలవుతోంది. రికార్డుల్లో అక్రమంగా ఇల్లు మంజూరైనట్లు చూపిస్తుండటంతో, దరఖాస్తు L3 కింద నిలిచిపోయి ఇప్పుడు రావలసిన ఇందిరమ్మ ఇల్లు కూడా దక్కకుండా పోతోందని లక్ష్మి కన్నీరు మున్నీరవుతోంది.
ఈ దగాపై బాధితులు ఇప్పటికే కలెక్టర్ గ్రీవెన్స్‌లో ప్రజావాణి ద్వారా వినతిపత్రం సమర్పించడంతో పాటు, గుడిహత్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కూడా దరఖాస్తు అందజేశారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన పంచాయతీ కార్యదర్శి సైతం లక్ష్మికి ఎలాంటి ఇల్లు లేదని ధ్రువీకరిస్తూ, ఆన్‌లైన్ రికార్డులను L3 నుండి L1కి సవరించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
గతంలో జరిగిన ఈ అక్రమంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని, తమకు ఏ పాపమూ తెలియకపోయినా జరుగుతున్న ఈ ఆలస్యాన్ని నివారించి, త్వరగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని ఆ ఆదివాసీ దంపతులు వేడుకుంటున్నారు.




