Gudihathnoor: గుడిహత్నూర్‌లో దొంగతనం కేసు ఛేదన ఇద్దరి అరెస్ట్!
Gudihathnoor: గుడిహత్నూర్‌లో ఇంటెలు చోరీ కేసును ఛేదించిన పోలీసులు. ప్రధాన నిందితుడితో పాటు సొత్తు కొన్న స్వర్ణకారుడి అరెస్ట్, 100 శాతం సొత్తు రికవరీ.
Gudihathnoor: గుడిహత్నూర్‌లో దొంగతనం కేసు ఛేదన ఇద్దరి అరెస్ట్!
Gudihathnoor: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని మహంకాళి గల్లీలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడితో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుడిహత్నూర్ ఎస్సై ఎల్. శ్రీకాంత్ వెల్లడించారు.
మహంకాళి గల్లీకి చెందిన దుర్వ రాధ ఈ నెల 9న తన భర్తతో కలిసి కూలి పనికి వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలతో పాటు లోపల ఉన్న స్టీల్ బాక్స్ తాళాలు పగలగొట్టి సుమారు రూ.85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన బాధితులు చోరీ జరిగినట్లు గుర్తించి గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పగిలిన తాళాలను స్వాధీనం చేసుకుని, క్లూస్ టీం మరియు ఫింగర్ ప్రింట్ బ్యూరో నిపుణుల సాయంతో వేలిముద్రల ఆధారాలను సేకరించారు. సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి విచారణ ఆధారంగా బజార్‌హత్నూర్ మండలం గిర్జై గ్రామానికి చెందిన డ్రైవర్ పెండూర్ మధుకర్ (21)ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అతడు చోరీ చేసిన సొత్తును కొనుగోలు చేసిన గుడిహత్నూర్‌కు చెందిన స్వర్ణకారుడు దహలే సంతోష్ (46)పై కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీకి గురైన రూ.85,600 విలువైన ఆభరణాలను వంద శాతం రికవరీ చేసినట్లు ఎస్సై తెలిపారు. దొంగిలించిన వస్తువులని తెలిసి కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, ప్రజలు ఇళ్లకు నాణ్యమైన తాళాలు వేసుకోవడంతో పాటు ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై శ్రీకాంత్ సూచించారు.




