Dasturabad: శిథిలావస్థలో దస్తురాబాద్ తహసీల్దార్ కార్యాలయం!
Dasturabad: దస్తురాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు సిమెంట్ పెచ్చులు ఊడిపడటంతో సిబ్బంది, ప్రజలు భయాందోళన నడుమ గడుపుతున్నారు.
Dasturabad: శిథిలావస్థలో దస్తురాబాద్ తహసీల్దార్ కార్యాలయం!
Dasturabad: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దుస్థితి ఇది! కార్యాలయంలోకి అడుగుపెట్టాలంటేనే జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. భవనం లోపల, బయట పైకప్పు సిమెంట్ పెచ్చులు ఊడిపోయి తుప్పుపట్టిన ఇనుప కడ్డీలు ప్రమాదకరంగా బయటకు తేలాయి. గోడల ప్లాస్టరింగ్ ఊడిపోయి నాచు పట్టి పాడుబడిన ఇల్లా కనిపిస్తోంది.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భవనం మరింత బలహీనపడింది. పైకప్పు నుంచి నీరు కారుతుండటంతో గోడలన్నీ తేమతో నిండిపోయాయి. వివిధ పనుల నిమిత్తం రోజువారీగా ఆఫీస్ కు వచ్చే మండల వాసులు.
లోపలికి రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది సైతం ఏ నిమిషంలో భవనం కూలుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరగక ముందే దస్తురాబాద్ మండలానికి నూతన తహసీల్దార్ భవనాన్ని మంజూరు చేసి, నిర్మించాలని మండల వాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.




