Nirmal: బాసరకు పోటెత్తనున్న భక్తులు.. కలెక్టర్, ఎస్పీ హైలెవల్ మీటింగ్!

Nirmal: బాసరలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల అధికారులతో సమీక్షించి నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 10 Sept 2026 8:11 PM IST
Nirmal
X

Nirmal: బాసరకు పోటెత్తనున్న భక్తులు.. కలెక్టర్, ఎస్పీ హైలెవల్ మీటింగ్!

నిర్మల్ జిల్లా: గోదావరి పుష్కరాల పనులన్నీ శాఖల మధ్య సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల పనులపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాసరలో పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు, వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.

పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, సంఖ్య లెక్కింపు అంశాల్లో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు. చేపట్టే పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పనులన్నీ నాణ్యవంతంగా ఉండాలని స్పష్టం చేశారు.

భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. భక్తుల రద్దీ మేరకు తగినన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని వివరించారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి వసతి కల్పించాలని చెప్పారు. హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, పుష్కరాలకు వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పిస్తామని అన్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో ఉండి, భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ తరపున సహకారం అందిస్తామన్నారు.

కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, కేంద్రీకృత విధానం ద్వారా నిఘా ఉంచుతామని అన్నారు. సీసీ కెమెరాల సహాయంతో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. తగినంత మంది పోలీసు సిబ్బందిని పుష్కరాలకు కేటాయిస్తామని ఎస్పీ అన్నారు.

ఈ సమావేశంలో ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, నీటిపారుదల శాఖల ఈఈ లు సుభాష్, సందీప్, శంకరయ్య, అనిల్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story