Nirmal: అర్హులందరికీ పారదర్శకంగా 'చేయూత' పింఛన్లు: నిర్మల్ కలెక్టర్!

Nirmal: నిర్మల్ జిల్లాలో అర్హులైన వారందరికీ పారదర్శకంగా 'చేయూత' పింఛన్లు అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 12 Aug 2026 7:31 PM IST
Nirmal
X

Nirmal: అర్హులందరికీ పారదర్శకంగా 'చేయూత' పింఛన్లు: నిర్మల్ కలెక్టర్!

నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'చేయూత' పింఛన్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా, వేగవంతంగా పింఛన్లు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, అర్హతల పరిశీలనతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, వనమహోత్సవం, తెలంగాణ జలసిరి కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించి అధికారులకు కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కొత్త చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. అందిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల ప్రజలు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎక్కడా పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే ప్రారంభించి, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ఇండ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

వనమహోత్సవం కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. తెలంగాణ జలసిరి పథకం కింద సోక్ పిట్లు, బోర్‌వెల్లు, ఫామ్ పాండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు గుర్తించిన దుకాణాలను సీజ్ చేయాలనీ, భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు రవిబాబు, సుందర్ సింగ్, వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story