Mancherial: కాంగ్రెస్ 1000 రోజుల పాలన పూర్తిగా డొల్ల: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
Mancherial: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
Mancherial: కాంగ్రెస్ 1000 రోజుల పాలన పూర్తిగా డొల్ల: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
Mancherial: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై పలు విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన ప్రజలకు నిరాశే మిగిల్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలు తమ భూముల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టిందని బాల్క సుమన్ అన్నారు. ముఖ్యంగా చెన్నూరు ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తాము పనులు ప్రారంభించామని, అయితే ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందని ఆరోపించారు.
రాజకీయంగా తమకు పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను నిలిపివేయడం సరికాదని బాల్క సుమన్ అన్నారు.
నిలిచిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 40 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారని గుర్తు చేసిన బాల్క సుమన్.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చెన్నూరు నియోజకవర్గ సమస్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడాలని, నియోజకవర్గానికి అవసరమైన నిధులు తీసుకువచ్చి నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.




