Nirmal: నిర్మల్‌లో రైతు మహా ధర్నా.. రోడ్డుపై ధాన్యం పోసి నిరసన!
Nirmal: పంట కొనుగోళ్ల జాప్యంపై నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా జరిగింది.
Nirmal: నిర్మల్‌లో రైతు మహా ధర్నా.. రోడ్డుపై ధాన్యం పోసి నిరసన!
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందుగల జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ళ జాప్యంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తాము పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి జాతీయ రహదారిపై పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు చేస్తే 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 15 లక్షలు మాత్రమే కొనుగోలు చేసిందని ధ్వజమెత్తారు. దీంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై పట్టించుకోకుండా కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న, వరి రైతులు అమ్ముకునేందుకు అవస్థలు పడుతూ అధికారుల కాళ్ళు మొక్కుతున్న ప్రభుత్వం మాత్రం కనికరం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమ ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల బాధలను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలో ప్రతిరోజు రైతులు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల ధాన్యాన్ని కొనని రైతు వ్యతిరేక ప్రభుత్వ మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామన్నారు. అనంతరం నిర్మల్ ఆర్డీవో కార్యాలయంలో రైతులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నా పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.




