Gudihatnur: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి!

Gudihatnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు.. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్.

NAGULA SATISH, BOATH
Published on: 16 Sept 2026 2:39 PM IST
Gudihatnur
X

Gudihatnur: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి!

Gudihatnur: సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

1948 సెప్టెంబర్‌ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్‌ సంస్థానం విముక్తి చెంది ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైందని, ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రభుత్వం అధికారికంగా స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను "ప్రజా పాలన దినోత్సవం"గా నిర్వహిస్తున్న నేపథ్యంలో, విమోచన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరారు.

​ఈ సందర్భంగా పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ, నాటి పోరాట చరిత్రను, వీరుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విమోచన దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించి తగిన రీతిలో వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు గణేష్ పటేల్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీపీ భరత్, మాజీ సర్పంచ్ రమేష్ జాదవ్, వామన్ పటేల్, సిద్ధార్థ ససానేతో పాటు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH