Bellampalli: భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన మున్సిపల్ యంత్రాంగం!

Bellampalli: బెల్లంపల్లిలో భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతి రమేష్ బాబు, కమిషనర్ రమేష్ పర్యటించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 July 2026 6:51 PM IST
Bellampalli
X

Bellampalli: భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన మున్సిపల్ యంత్రాంగం!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల ప్రభావంతో ఇళ్లు దెబ్బతినడం, చెట్లు నేలకొరగడం, రహదారులపై నీరు నిలవడంతో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, కమిషనర్ తన్నీరు రమేష్ క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, కమిషనర్ తన్నీరు రమేష్ పట్టణంలోని బజార్ ఏరియాతో పాటు పలు బస్తీల్లో పర్యటించారు.

భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించి, వారికి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బందితో నాళాలను తెరిపించి వరద నీరు వేగంగా వెళ్లేలా చర్యలు చేపట్టారు.

పలు బస్తీల్లో నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు.

వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలు, డ్రైనేజీలను పరిశీలించిన అధికారులు పూడికతీత, వరద నీటి మళ్లింపు పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మున్సిపల్ అధికారులను సంప్రదించాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చైర్‌పర్సన్, కమిషనర్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story