బాసర క్షేత్రానికి నూతన శోభ: రూ. 225 కోట్లతో ఆలయ పునఃనిర్మాణం.. నేడు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
బాసర జ్ఞాన సరస్వతి ఆలయ రూపురేఖలు మారనున్నాయి. రూ. 225 కోట్ల వ్యయంతో పునఃనిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేడు భూమిపూజ చేయనున్నారు.
బాసర క్షేత్రానికి నూతన శోభ: రూ. 225 కోట్లతో ఆలయ పునఃనిర్మాణం.. నేడు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
Basara Temple Renovation: దక్షిణ భారతదేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం.. అక్షరాభాస్యాలకు ఆలవాలమైన బాసర క్షేత్రం పునఃనిర్మాణంతో కొత్త శోభను సంతరించుకోబోతోంది. 225 కోట్ల వ్యయంతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం పునః నిర్మాణానికి సిద్దమౌతుంది. శృంగేరి పీఠాధిపతుల సూచనలతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు అలయ అధికారులు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బాసర ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. తొమ్మిది అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఈశాన్యంలో కోనేరుతో ఆలయ నిర్మాణం చేయనున్నారు. బాసర ఆలయ విస్తీర్ణం మూడు రెట్లు పెరగనుంది. అదేవిధంగా ఆలయంలో భక్తుల సౌకర్యాల కోసం భారీ క్యూ కాంప్లెక్సులు , భోజన శాలలు, ప్రసాద కేంద్రాలు, పార్కింగ్, హెల్త్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి అలయ అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది.
ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బాసర చేరుకుని శ్రీ జ్ఞాన సరస్వతిదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి అధికారికంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలయ రూపు రేఖలు మార్చే విధంగా ప్రభుత్వం చేపట్టిన పనులుపై అధికారులతో సమీక్షిస్తారు. అక్కడి నుంచి పిప్రి గ్రామానికి బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.




