Gudihathnoor: హైవే అండర్ పాస్ వద్ద ప్రమాదం ఆటో బోల్తా!

Gudihathnoor: గుడిహత్నూర్ జాతీయ రహదారి అండర్ పాస్ వద్ద రోడ్డు అధ్వాన్నంగా మారడంతో భారీ గుంతలో ఆటో బోల్తా పడింది.

NAGULA SATISH, BOATH
Published on: 4 July 2026 2:54 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: హైవే అండర్ పాస్ వద్ద ప్రమాదం ఆటో బోల్తా!

గుడిహత్నూర్: మండల కేంద్రంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు అండర్ పాస్ అధ్వాన్నపు రోడ్లకు నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ఇక్కడి అండర్ పాస్ వద్ద ఉన్న భారీ గుంతలో నీరు నిలిచి ఉండటాన్ని గమనించలేక ఓ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అయితే ప్రమాద సమయంలో ఆటోలో ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన కూడలి వద్ద ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా జాతీయ రహదారి అధికారులు, సంబంధింత కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ అండర్ పాస్ ప్రాంతం ప్రయాణికులకు ఒక నరకకూపాన్ని తలపిస్తోంది. స్వల్ప వర్షానికే ఇక్కడి సర్వీస్ రోడ్డుపై మోకాలి లోతులో నీరు వచ్చి చేరుతుండటంతో, రోడ్డు ఎక్కడుందో.. గుంతలు ఎక్కడున్నాయో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ఈ నీటి గుంతల్లో చిక్కుకుపోయి తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం వందలాది ఆర్టీసీ బస్సులు సైతం ఈ సర్వీస్ రోడ్డునుండే హైవే పైకి వెళ్తాయి

రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యం ఇలా ఉంటే, ఇటీవల గుడిహత్నూర్ సర్పంచ్ ఆడే షీలా స్పందించి, ప్రయాణికుల ఇబ్బందులను గమనించి పంచాయతీ నిధుల ద్వారా ఇక్కడ తాత్కాలిక మరమ్మతు పనులు చేయించారు. అయినప్పటికీ భారీ వర్షాలు, నిరంతర వాహనాల రాకపోకల వల్ల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంతటి దారుణమైన పరిస్థితి నెలకొంటున్నా, సంబంధిత జాతీయ రహదారి అధికారులు మాత్రం కనీసం స్పందించడం లేదని స్థానిక ప్రజలు, ప్రయాణికులు మండిపడుతున్నారు. స్థానిక పంచాయతీ పాలకవర్గం తమ పరిధి కాకపోయినా నిధులు వెచ్చించి మరమ్మతులు చేపడుతుంటే, కోట్ల రూపాయల టోల్ వసూలు చేసే హైవే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన ఈ అండర్ పాస్ వద్ద శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరగకుండా రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని గుడిహత్నూర్ ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story