Adilabad: 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు చేరువయ్యేందుకు 'పోలీసులు మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. బట్టి సావర్గం, వాఘాపూర్ గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు.
Adilabad: 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం
ఆదిలాబాద్: ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను తెలుసుకోవడం, గ్రామాల్లో పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "పోలీసులు మీకోసం" కార్యక్రమం మావల మండలం బట్టి సావర్గం గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బట్టి సావర్గం గ్రామంలో ఏర్పాటు చేసిన 11 సీసీటీవీ కెమెరాలను, వాఘాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 9 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు. గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడంతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను త్వరితగతిన గుర్తించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల భద్రత కోసం ప్రజలు ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సాగు, నిల్వ, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని హెల్మెట్ ధరించాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో ఎలాంటి నేరాలు జరిగినా, మహిళలు లేదా చిన్నారులకు సంబంధించిన సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.




