Bazarhatnoor: మహారాష్ట్రలో పోలీసులపై మూకుమ్మడి దాడి, నిందితుడు అరెస్ట్
Bazarhatnoor: మహారాష్ట్రలో బజార్హత్నూర్ పోలీసులపై స్థానికులు దాడి చేసి నిందితుడిని విడిపించారు. ప్రత్యేక బలగాల గాలింపుతో తిరిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Bazarhatnoor: మహారాష్ట్రలో పోలీసులపై మూకుమ్మడి దాడి, నిందితుడు అరెస్ట్
బజార్హత్నూర్: ఓ చోరీ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ పోలీసులపై మహారాష్ట్రలో స్థానికులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. గత కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడు షేక్ బకర్ అలియాస్ జాఫర్‌ను పట్టుకునేందుకు బజార్హత్నూర్ ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు ఆగస్టు 30న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్‌కు వెళ్లారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రైవేట్ వాహనంలో తిరిగి వస్తుండగా, చిక్లీ క్రాస్ రోడ్డు వద్ద సుమారు 60 మంది గ్రామస్థులు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు.
నిందితుడిని విడిపించే క్రమంలో గ్రామస్థులు విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేయడంతో పోలీసుల వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఆత్మరక్షణ కోసం బజార్హత్నూర్ ఎస్సై గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ గందరగోళంలో నిందితుడు షేక్ బకర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
ఈ సంచలన ఘటనపై బజార్హత్నూర్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిన్వట్ పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక బలగాలతో చిక్లీ గ్రామానికి వెళ్లి గాలింపు చేపట్టి, తప్పించుకున్న నిందితుడు షేక్ బకర్‌ను తిరిగి అదుపులోకి తీసుకున్నారు.




