Boath: ఏబీసీడీలు రాలేదని నర్సరీ బాలుడిపై టీచర్ పైశాచికత్వం!

Boath: ఆదిలాబాద్ జిల్లా బోథ్ వేదం పాఠశాలలో నర్సరీ బాలుడిపై టీచర్ అమానుషంగా దాడి చేసింది.

NAGULA SATISH, BOATH
Published on: 28 Aug 2026 9:28 PM IST
Boath
X

Boath: ఏబీసీడీలు రాలేదని నర్సరీ బాలుడిపై టీచర్ పైశాచికత్వం!

బోథ్: ​ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. అక్షరాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే కసాయిలా మారి, నాలుగేళ్ల చిన్నారిపై కర్కశత్వాన్ని ప్రదర్శించింది. బోథ్ మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో నర్సరీ చదువుతున్న రిత్విక్ రెడ్డి అనే బాలుడిని, ఏబీసీడీలు సరిగ్గా రాయడం లేదన్న చిన్న కారణంతో టీచర్ విచక్షణారహితంగా చితకబాదింది. చేతితో, కర్రతో ఏకంగా ఎనిమిది నిమిషాల పాటు ఆగకుండా ఆ పసివాడిపై దాడికి తెగబడింది.

​పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలుడు తీవ్రమైన చెవి నొప్పితో ఏడుస్తుండటం, చెంపలు, చెవి భాగం కమిలిపోయి వాపు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఏమైందని ఆరా తీయగా, పాఠశాలలో టీచర్ కొట్టిందని ఆ పసివాడు ఏడుస్తూ చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు, బంధువులు వెంటనే పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, టీచర్ చిన్నారిని విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాలు రికార్డై కనిపించడంతో అంతా నివ్వెరపోయారు.

​ఈ దారుణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాలుడి తల్లిదండ్రులు, సీసీటీవీ దృశ్యాల ఆధారాలతో బోథ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నారిపై అమానుషంగా దాడికి పాల్పడిన సదరు టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story