Adilabad: వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి

Adilabad: తలమడుగు మండలం పల్సి(కె)లో డిజిటల్ క్రాప్ సర్వే, డ్రోన్ పిచికారీని పరిశీలించిన అదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 11 Sept 2026 6:35 PM IST
Adilabad
X

Adilabad: వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి

ఆదిలాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో విస్తృతంగా వినియోగించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతోపాటు సమయం ఆదా చేసి రైతులు అధిక లాభాలు పొందవచ్చని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తలమడుగు మండలం పల్సి (కె) గ్రామంలో పర్యటించిన ఆయన డిజిటల్ క్రాప్ సర్వే, డ్రోన్‌ ద్వారా పత్తి చేనులో పురుగుమందుల పిచికారీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామానికి చెందిన రైతు ఘన్‌శ్యామ్‌ పత్తి చేనులో డ్రోన్‌ ద్వారా పురుగుమందుల పిచికారీ చేసే విధానాన్ని కలెక్టర్‌ పరిశీలించి, దాని వినియోగం, ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులను అధిగమించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సమీకృత వ్యవసాయ విధానాలను అవలంబించాలని కలెక్టర్‌ సూచించారు. ఉపాధి హామీ పథకం కింద ఫాంపాండ్లు నిర్మించుకుంటే రెండో పంట సాగుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే ఉన్న ఫాంపాండ్లను బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.ఫాంపాండ్లతోపాటు పశువుల షెడ్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

జిల్లాలో తొలిసారిగా పల్సి (కె) గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు డ్రోన్‌ పైలట్‌ శిక్షణ ఇప్పించి, సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా రూ.లక్ష మార్జిన్‌ మనీతోపాటు రాయితీపై బ్యాంకు రుణం అందించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మరింత మంది యువతకు డ్రోన్‌ స్ప్రేయింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తామని వెల్లడించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.