కొత్త ముఖాలకు గాడీలో చోటు దక్కింది.. ఇక పొలిటికల్‌ హైవేపై బ్రేకుల్లేని దూకుడేనా?

కొత్త ముఖాలకు గాడీలో చోటు దక్కింది.. ఇక పొలిటికల్‌ హైవేపై బ్రేకుల్లేని దూకుడేనా?
x
Highlights

Will BJP go aggressive with new faces in upfront: పాత స్పేర్‌ పార్ట్స్‌ అన్నీ మూలకుపడ్డాయి. ఓల్డ్‌ టైర్లన్నీ షెడ్డుకు షిఫ్ట్‌ అయ్యాయి. కొత్త...

Will BJP go aggressive with new faces in upfront: పాత స్పేర్‌ పార్ట్స్‌ అన్నీ మూలకుపడ్డాయి. ఓల్డ్‌ టైర్లన్నీ షెడ్డుకు షిఫ్ట్‌ అయ్యాయి. కొత్త పార్ట్స్‌తో బండి, సరికొత్తగా రెడీ అయ్యింది. ఇక తెలంగాణ పొలిటికల్ హైవేపై బ్రేకుల్లేని దూకుడేనని, హారన్‌ రీసౌండ్‌ ఇస్తోంది. మరి బండిలో చోటు దక్కని సీనియర్ డ్రైవర్లు స్పీడ్‌ బ్రేకర్లేస్తే...? బండి టర్నింగ్ తప్పదా? కుదుపులు అనివార్యమా? అయినా రయ్యిన వెళ్ళాలనే డిసైడయ్యారా? బండి సంజయ్‌ కొత్త టీంపై, పార్టీలో జరుగుతున్న చర్చేంటి? సీనియర్లు వేసే స్పీడ్ బ్రేకర్లేంటి?

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరూ ఊహించని స్పీడ్‌తో టార్గెట్ చేజ్ చేసిన బండి సంజయ్‌కు, అదే జెట్‌ స్పీడ్‌తో పార్టీని పరుగులు పెట్టించాలని బాధ్యతలు అప్పగింగించింది కాషాయ అధిష్టానం. కాకరేపే మాటల మీటర్‌ను, క్షణాల్లోనే రివ్వున తిప్పే బండి సంజయ్‌, అంచనాలకు తగ్గట్టుగానే దూకుడు ప్రదర్శించారు. కానీ ఊహించినదానికంటే బండి స్లోగా వెళ్లింది. అందుకు కారణం, బండిలో ఓల్డ్ స్పేర్‌ పార్ట్స్‌ లాంటి సీనియర్ నేతలేనని గ్రహించినట్టున్నారు సంజయ్. అందుకే బండిని 180 కేఎంపీహెచ్‌తో సర్రున లాగించాలంటే, కొత్త స్పేర్‌ పార్ట్స్‌‌ను బిగించడమే మార్గమనుకున్న సంజయ్, చాలా రోజుల మథనం తర్వాత, సరికొత్త టీంను సెట్‌ చేసుకున్నారు. అబ్‌ గాడీ నయా హై. అయితే, కమిటీలో కొత్త ముఖాలపై సరికొత్త అలజడి కూడా, తుపానుకు ముందు ప్రశాంతతలా సిగ్నల్ ఇస్తోంది. అదే బండిని మళ్లీ టెన్షన్ వైపు మళ్లిస్తుందా అన్న చర్చ.

23 మందితో కొత్త రాష్ట్ర కమిటీని నియమించుకున్నారు స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది కార్యదర్శులు, నలుగురు ప్రధాన కార్యదర్శులకు కమిటీలో చోటు కల్పించారు. ఎవరూ ఊహించని రీతిలో పాతవారిలో అత్యధికులను పక్కనపెట్టి, కొత్తవారికి అవకాశమిచ్చారు. తెలంగాణ బిజేపిలో కొత్త కమిటి గతానికి భిన్నంగా కనిపిస్తోంది. ఎప్పటి లాగే మూస కమిటికి పోకుండా తన మార్క్ కమిటిని నియమించుకున్నారు సంజయ్. ఎక్కువగా యువతకు అవకాశమిస్తూ పార్టీ సీనియర్లకు ఊహించని షాక్చిచ్చారు. అయితే, జూనియర్లకు పెద్ద పీట వెయ్యాలని కేంద్ర పార్టీ చెప్పిందా ? లేక తానే స్వయంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ, పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

కొత్తవారికి, జూనియర్లకు పార్టీలో అవకాశమివ్వాలన్నా అధిష్టానం లైన్ ప్రకారమే, కొత్త కమిటీ కూర్చు చేశారని తెలుస్తోంది. పార్టీలో వరుసగా అనేక కమిటీల్లో ఏళ్లుగా పదవులు అనుభవిస్తూ వస్తున్న సీనియర్లను నిర్దాక్షిణ్యంగా సంజయ్‌ పక్కనపెట్టారన్న చర్చ జరుగుతోంది. తెలుగుదేశం, కాంగ్రెస్‌లను వీడి, బిజేపిలోకి కొత్తగా వచ్చిన వారికి ఎక్కవగా ప్రాధాన్యత కల్పించలేదన్న విమర్శ కూడా పార్టీలో వినిపిస్తోంది. ఇలాగైతే, మిగతా వాళ్లు పార్టీలోకి ఎలా వస్తారని ప్రశ్నించేవారూ వున్నారు. కొత్తగా కమిటిలో చోటు దక్కినవారిలో, ఈమధ్యే పార్టీ తీర్థం పుచ్చుకున్న విజయరామరావు, యన్నం శ్రీనివాస్ రెడ్డి, శోభారాణీలకు బెర్త్ దొరికినా, పెద్దగా ప్రాధాన్యత వున్న పోస్టులు ఇవ్వలేదనే చర్చ కూడా నడుస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గరికపాటి రామోహన్ రావు, మోత్కుపల్లి నర్సింహ్ములు, దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేంధర్ గౌడ్, దీపక్ రెడ్డి లాంటి యువనేతలకు అసలు ప్రాధాన్యతే ఇవ్వలేదన్న ఆగ్రహాలూ గుప్పుమంటున్నాయి. చివరికి పెద్దిరెడ్డి, డీకే అరుణ, వంటి నేతల పేర్లూ లేవు కమిటీలో. అయితే, జాతీయ పార్టీ కమిటిలో వీరికి స్థానం కల్పించే అవకాశముందని ప్రచారం జరుగుతున్నా, సదరు నేతలు మాత్రం రగిలిపోతున్నారట.

తెలంగాణ బిజేపికి ఇన్ని రోజులూ హైదరాబాద్ బిజేపి అని ముద్ర ఉండేది. అది చెరిపివేయడానికి కరీంనగర్ జిల్లాకు చెందిన బండిసంజయ్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. అదే బాటలో సంజయ్ తన సొంతటీంను నియమించుకున్నారు. హైదరాబాద్ నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా, జిల్లాల నేతలకు ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతోంది. అలాగే ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు చేసిని కుటుంబాలకు, తన టీంలో అవకాశం కల్పించారు బండి. పార్టీ జాతీయాధ్యక్షుడిగాసేవలు చేసిన బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్ కి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించి, తన స్టైల్‌లోనే స్ట్రీట్‌ ఫైటింగ్‌ సిద్దంకావాలని చెప్పకనే చెప్పారు. కానీ బద్దం బాల్ రెడ్డి కుమారుడు బద్దం మహిపాల్ రెడ్డికి యువమోర్చా పదవి కావాలని ప్రయత్నం చేసినా, కొత్త కమిటిలో ఆయనకు అవకాశం కల్పించలేదు.

అయితే, బండి సంజయ్ కొత్త కమిటీపై సీనియర్లు చాలామంది కుతకుత ఉడుకుతున్నారట. తన మార్క్ చూపించుకునేందుకు పార్టీ సీనియర్ల సిఫారసులను వినలేదట. హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించినవారిలో ఒక్కరికీ చాన్స్ ఇవ్వలేదట. ఇక రాజాసింగ్, లక్ష్మణ్‌‌ల లిస్టులో ఎవ్వర్నీ కనికరించలేదట. కేవలం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పిన వారిలో, ఇద్దరికి మాత్రమే అవకాశమిచ్చారట. అయితే, బండి కొత్త కమిటీపై పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ ముద్ర స్పష్టంగా వున్నట్టు కొందరు చెబుతున్నారు. అయితే, కొత్త కమిటీలో తమకు చోటు ఇవ్వకపోవడాన్ని, సీనియర్లు ఏకంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దృష్టికి సైతం తీసుకెళ్లారట. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీలో కరడుగట్టిన కాషాయవాదులను ఢీ కొట్టడానికి సైతం సంజయ్‌ సిద్దమయ్యారన్న చర్చ జరుగుతోంది. చూడాలి, సీనియర్లు బండికి స్పీడ్ బ్రేకర్లేసి ముప్పతిప్పలు పెడతారా లేదంటే స్పీడ్‌ బ్రేకర్లను సైతం అవలీలగా క్రాస్ చేసి టార్గెట్ రీచ్‌ అవుతారా?

Show Full Article
Print Article
Next Story
More Stories