logo
తెలంగాణ

పార్టీల చుట్టూ గిర్రున తిరిగే ఆ వలస నాయకుడు ఎక్కడ?

పార్టీల చుట్టూ గిర్రున తిరిగే ఆ వలస నాయకుడు ఎక్కడ?
X
Highlights

నాగం జనార్ధన్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సీనియర్ రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితులు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.

Where are those leader who likes to switch పార్టీస్: సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టుగా, రాజకీయ పార్టీల చుట్టూ ఆ‍యన పరిభ్రమిస్తుంటాడు. ఒక కక్ష్య నుంచి మరో కక్ష్యలోకి వెనువెంటనే జంపయ్యే పొలిటికల్ గ్రహం ఆయన. ఓ పార్టీ కాంతితో, ఒక వెలుగు వెలిగాడు. కానీ ఇప్పుడు అమావాస్య చంద్రుడిలా మసకబారిపోయాడు. రాజకీయార్థ గోళంలో, ఆ గ్రహాన్వేషికి, బ్యాడ్‌ టైం, బ్యాండ్‌మేళం వాయిస్తోందా?

నాగం జనార్ధన్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సీనియర్ రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితులు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ప్రతిపక్షంలో ఉంటూ అధికారపక్షాన్ని అడుగడుగున నిలదీసిన సీనియర్ నేత. అయితే గత కొన్ని ఏళ్లుగా ఆయన అడుగులు రాజకీయంగా తడబడుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు హస్తం పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి హస్తవాసి ఏమంత చెప్పుకోదగింది గా లేదు.

నాగం జనార్ధన్‌ రెడ్డి. హద్దు మీరే అడుగులు. మంటలు రేపే మాటలు. ప్రత్యర్థులు బియ్యం రెడ్డి అంటారు. గడియ గడియకో కండువా మార్చే నేత అని కూడా పిలుచుకుంటారు. మ్యూజికల్‌ చెయిర్స్‌లా పార్టీల వెంట పరుగులు పెట్టే లీడర్‌గా మాట్లాడుకుంటారు. పాలమూరులో ఒకప్పుడు చక్రంతిప్పి, భూచక్రంలా పార్టీల చుట్టూ గిర్రున తిరుగుతూ, ఎక్కడ ఉన్నారో, ఏ పార్టీలో వున్నారో, అనుచరులకే అర్థంకాని ఆగమాగం నాగం.

ఇలా చెప్పుకుంటే చాంతాండ వుంది నాగం గురించి. కానీ పేరెత్తితే ఆగమే గుర్తొస్తుంది. ఎందుకంటే, ఆయన రాజకీయ జీవితం, రష్యన్ సర్కస్‌‌ ఫీట్లకు ఏమాత్రం తీసిపోదు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి రాజకీయంగా కష్టకాలంలో ఉన్నారట ఇప్పుడు. టీడీపీ ముఖ్య నేతగా గుర్తింపు పొందిన ఆయనకు, 2009 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. మూడు దశాబ్దాల పాటు ఒక్క పార్టీలో ఉన్న ఆయన, వివిధ పార్టీలోకి జంపింగ్‌ల మీద జంపింగ్‌లు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో, మొదట టిడిపిలో ఉండి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన తన వంతు పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సొంత పార్టీని ఎదిరించి టీడీపీకి దూరమయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల చేత దెబ్బలు తిన్నారు. తెలంగాణ నగారా సమితి పేరుతో రాష్ట్ర సాధన కోసం ఒక వేదికను కూడా ఏర్పాటు చేశారు. నాగర్‌ కర్నూల్ స్థానానికి రాజీనామా చేశాక వచ్చిన ఉప ఎన్నికల్లో, భారీ మెజార్టీతో విజయం సాధించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల ముందు బీజేపీ గూటికి చేరారు నాగం. కానీ కమలం పార్టీలో ఆయనకు, ఆయన అనుచరులకు అనుకున్నంత ప్రాధాన్యత దక్కలేదు. దాంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన రూట్ మార్చుకున్నారు. తన రాజకీయ జీవితంలో శత్రువుగా భావించిన కాంగ్రెస్ గూటికి సైతం చేరాల్సి వచ్చింది నాగంకు. టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా కేసీఆర్ కు బద్ద వ్యతిరేకిగా ముద్రపడిన నాగం, ఆ పార్టీలోకి వెళ్ళలేక, వెళ్లేదారి లేక కాంగ్రెస్‌కు ఫేస్‌ టర్నింగ్ ఇచ్చుకున్నారు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్దన్ రెడ్డి, టిడిపి ప్రభుత్వంలో పలు దఫాలు మంత్రిగా పని చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోను, అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా మాట్లాడే వారు. గాలి జనార్దన్ రెడ్డి గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని కూడా ఆయన చిన్న తరహా యుద్ధమే చేశారు. అంతటి అనుభవం కలిగిన నాగం పరిస్థితి, ఆగమైందిప్పుడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు ఎక్కువ మంది వ్యతిరేకించినా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన, ఆ పార్టీలో క్రియాశీలకంగా మారుతారు అనుకున్నారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా మరో బలమైన గళమని నాగంను భావించారు. నాగంకు కాంగ్రెస్‌లో అనుకున్నంత ప్రాధాన్యత దక్కలేదనే వాదన కూడా ఉంది. ఆయన అనుభవంలో సగం వయసు కూడా లేని నేతలు దూసుకుపోతూ ఉంటే నాగం ఎందుకు మిన్నకుండి పోయారని అంతా అనుకుంటున్నారు.

2014 ఎన్నికల్లో నాగం సరిదిద్దుకోలేని తప్పటడుగు వేశారని రాజకీయ పండితుల విశ్లేషణ. బిజెపి తరఫున మహబూబ్ నగర్ పార్లమెంట్ కు నాగం, ఆయన కుమారుడు శశిధర్ రెడ్డి నాగర్ కర్నూల్ స్థానానికి పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. అయితే నాగం జనార్ధన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని అంతా భావిస్తుంటారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో, నాగం బిజెపికి దూరమై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా, ఆయనకు ఏమాత్రం కలిసి రాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నాగర్‌ కర్నూల్‌ నుంచి పోటీ చేసినా, విజయం సొంతం చేసుకోలేక పోయారు. ఏడుపదుల వయసులో కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పని చేద్దాం అనుకున్న సమయంలో, పెద్ద కుమారుడు దినకర్ రెడ్డి మరణంతో డీలా పడ్డారు.

అయితే కొద్ది నెలలుగా నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తన వాయిస్ వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, నీటిపారుదల శాఖలో అవినీతి జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై మీడియా ముందుకొచ్చి వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పోతిరెడ్డిపాడు రాయలసీమ ఎత్తిపోతల పథకాల పేరుతో తెలంగాణ నీటిని తరలించుకుపోతోందంటూ పోరాటం చేస్తున్నారు. కొన్ని విషయాలపై నాగం జనార్దన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. మొత్తానికి తన శైలికి భిన్నంగా పనిచేస్తున్న నాగం జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయాల్లో రాణించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. సొంత నియోజకవర్గం నాగర్ కర్నూల్ లో బలపడకపోవడం, వయసు మీద పడుతుండటం, ఆయనకు ప్రస్తుతం పెద్ద సమస్యగా మారాయి. చూడాలి, నాగం రాజకీయ జీవితం ఇంకా ఎలాంటి మలుపులు తిరగుతుందో.Web TitleWhere are those leader who likes to switch parties
Next Story