వృద్దతరం వర్సెస్ యువతరం.. టీ యూత్‌ కాంగ్రెస్‌లో గొడవేంటి?

వృద్దతరం వర్సెస్ యువతరం.. టీ యూత్‌ కాంగ్రెస్‌లో గొడవేంటి?
x
Highlights

అత్యధిక మెంబర్‌షిప్‌లు చేసినవారికే యూత్‌ కాంగ్రెస్‌లో పదవులు. బహుశా అత్యధిక కేసులున్నవారికే పదవులిస్తారని, పొరపాటుగా భావించినట్టున్నారు కొందరు యంగ్...

అత్యధిక మెంబర్‌షిప్‌లు చేసినవారికే యూత్‌ కాంగ్రెస్‌లో పదవులు. బహుశా అత్యధిక కేసులున్నవారికే పదవులిస్తారని, పొరపాటుగా భావించినట్టున్నారు కొందరు యంగ్ కాంగ్ లీడర్లు. చేతులనిండా మెంబర్‌షిప్‌‌ కాగితాలకు బదులు, ఎఫ్‌ఐఆర్‌లు తగిలించుకు తిరుగుతున్నారని, వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూత్ కాంగ్రెస్‌ ఎన్నికల వేళ, కొందరు యువ నాయకులపై సీనియర్లు తెగ ఫైరవుతున్నారట. యూత్ కాంగ్రెస్‌ ఎలక్షన్స్‌ వేళ ఈ కేసుల గొడవేంటి?

తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. పార్టీ వారసులుగా వచ్చే కొత్తతరం కోసం, పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంకల్పం కోసం తెలంగాణలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు టిపిసిసి నేతలు. ఈ ఎన్నికలే వేదికగా బలప్రదర్శనకు సిద్దమయ్యారు లీడర్లు. ఎవ్వరికి వారు తమ నేతను గెలిపించకోవడానికి పైరవీలు మొదలుపెట్టారు. అలాగే, అత్యధికంగా ఎవరు మెంబర్ షిప్ చేయిస్తే వారిని జాతీయ పార్టీ పిలిచి మరీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపిక చేసి ప్రకటించడం ఈసారి ఎన్నిక ఆనవాయితి. అయితే, అత్యధిక మెంబర్‌షిప్‌లు కాదు, అత్యధిక కేసులన్నవారే, పోటీ చేస్తున్నారని సీనియర్లు లబోదిబోమంటున్నారు. ఎక్కువ కేసులున్న వీరంతా పదవులు పొందితే, పార్టీ పరువే కాదు, భవిష‌్యత్తూ అంధకారమేనని రుసరుసలాడుతున్నారట.

యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రధాన పోటిదారుగా పేరు వినిపిస్తున్న పేరు శివసేనా రెడ్డి. ఈ‍యనపై కేసులు చర్చనీయాంశంగా మారాయి. ఆయనపై ఉన్న కేసులున్న విషయం బయటకు పొక్కడంలో పార్టీలో నేతలంగా ఆందోళన చెందుతున్నారట. నాగర్ కర్నూల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతగా పార్టీలో పేరున్న శివసేనారెడ్డి, మూడు ఆవులను బలిచ్చిన కేసులో నిందితుడగా తప్పించుకు తిరుగుతున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనపై వనపర్తి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైవుందని, కొందరు ఆ కాపీలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒకవేళ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షపదవి చేపడితే, వెంటనే ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయిస్తే, పార్టీ పరువు గంగలో కలుస్తుందని గాంధీ భవన్‌లో మాట్లాడుకుంటున్నారట.

ఈయనతో పాటు, మరో ఇద్దరు, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటిపడుతున్నారు. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కుమారుడు సాయి నాయక్, మరొకరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజీవ్ రెడ్డిలు కంటెస్ట్ చేస్తున్నారు. వీరిలో సాయినాయక్ గతంలో యూత్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇక మరో నేత రాజీవ్ రెడ్డి. గత యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాజీవ్‌ను పోటీ చెయ్యకుండా నాడు మాజీ మంత్రి డికే అరుణ అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడామే బీజేపీలోకి వెళ్లారు కాబట్టి, రాజీవ్ మరోసారి పోటీకి రెడీ అయ్యారు. మొత్తానికి యూత్‌ కాంగ్రెస్‌కు పోటీపడుతున్న ముగ్గురూ ముగ్గురే. ఒకరిపై కేసులు, మరో ఇద్దరిపై పార్టీలో అసంతృప్తి. అందుకే వీరిపై వృద్దతరం నేతలు కస్సుబుస్సులాడుతున్నారు. పార్టీకి లాయల్‌గా వున్నవారికే పదవులు దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి, యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ రగడ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories