తెలంగాణలో మళ్లీ వర్షాలు...ఈ జిల్లాల వారికి అలర్ట్!

Sumitra
Published on: 10 Oct 2020 5:57 PM IST
తెలంగాణలో మళ్లీ వర్షాలు...ఈ జిల్లాల వారికి అలర్ట్!
X

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం శనివారం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని చెప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. అదే విధంగా ఈ నెల 14వ తేదీన కూడా రాష్ట్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.

అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక పోతే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసాయి. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జగిత్యాల, కుమ్రం భీం, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ, జనగామ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని గండిపేటలో 125.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా కొండమల్లపల్లిలో 117.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Sumitra

Sumitra

Next Story