Top
logo

పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించే విధంగా విద్యాబోధన కొనసాగాలి : వెంకయ్యనాయుడు

పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించే విధంగా విద్యాబోధన కొనసాగాలి : వెంకయ్యనాయుడు
X

Venkaiah Naidu 

Highlights

హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ 21వ వ్యవస్థాపక...

హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వ‌ర్చువ‌ల్‌ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో క్రమశిక్షణ, చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం ద్వారా ఉన్నతమైన భావాలను పుణికిపుచ్చుకోవచ్చని అన్నారు. దీని ద్వారా అత్యుత్తమమైన అంశాల అన్వేషణకు మార్గం సుగమం అవుతుందన్నారు. విజ్ఞానాణ్వేషణ కేంద్రంగానే 21వ శతాబ్దపు పోటీ ప్రపంచం నడుస్తోందన్న ఆయన పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించే విధంగా విద్యాబోధన సాగాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అత్యుత్తమ అంశాల అన్వేషణ ద్వారా ముందుకు వెళ్లడం అత్యంత ఆవశ్యకమన్నారు. సృజనాత్మకతతో కొత్త విషయాల కోసం నిరంతరం అన్వేషించేలా ప్రోత్సహించే విద్యావ్యవస్థ ఉండడం ముఖ్యం అని తెలిపారు. దాని ద్వారా భవిష్యత్ భారతాన్ని మరింత వైభవోపేతంగా మలచుకునే వీలవుతుందని ఆకాంక్షించారు. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో సర్వమత సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వామి వివేకానందుడు ప్రసంగించిన వేదిక ద్వారా రెండేళ్ల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

వివేకానందుడి బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆర్కే మఠ్, ఆర్కే మిషన్ వంటి మరిన్ని సంస్థల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నాటి వివేకానందుడి ప్రసంగాల్లోని అంశాలు, నేటి అధునిక ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయని తెలిపారు. స్వామి వివేకానంద భారతీయ ఆత్మను, సంస్కృతిని అవగతం చేసుకున్నారన్నారు. అంతటి మహనీయమైన వ్యక్తి జీవితాన్ని, సందేశాలను యువత అధ్యయనం చేయడం ద్వారా తమ తమ జీవితాల్లో సానుకూల మార్పునకు బీజం వేసుకోవాలని ఆయన సూచించారు. సనాతన ధర్మం ఆధ్యాత్మిక పునాదులలో పొందుపరచిన గొప్ప ఆదర్శాలపై భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

విద్యార్థిని శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, నైతికత, సహిష్ణుత, సానుభూతి, ఆధ్యాత్మిక బలం కలిగిన పరిపూర్ణ వ్యక్తిగా మార్చేదే విద్య అని, జ్ఞానజ్యోతిని వెలిగించడంతోపాటు సాధికారత కల్పించేలా విద్యావ్యవస్థ ఉండాలని ఉపరాష్ట్రపతి అన్నారు. తన కళాశాల, విశ్వవిద్యాలయ రోజుల నుంచి స్వామి వివేకానందుడి పుస్తకాలను చదువుతున్నానన్నారు. ప్రాచీన భారత వైదిక తత్వం, వసుధైవ కుటుంబక భావన, శాంతి, సహనం మొదలై ప్రాచీన భారత విధానాలను ప్రపంచానికి పరిచయం చేసిన వివేకానందుడి ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. మతం, ఆధ్యాత్మికత, జాతీయవాదం, విద్య, తత్వం, సామాజిక సంస్కరణలు, పేదరిక నిర్మూలన, ప్రజాసాధికారత వంటి అంశాల్లో స్వామిజీ బోధనలు తననెంతగానో ప్రభావితం చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషన్ బేలూర్ మఠ్ ఉపాధ్యక్షుడు స్వామీ గౌతమానంద మహారాజ్, రామకృష్ణ మఠ్ హైదరాబాద్ అధ్యక్షుడు స్వామీ జ్ఞానానంద మహారాజ్, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానందతోపాటు జస్టిస్ చల్లా కోదండరాం, అధ్యాపకులు, విద్యార్థులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Web TitleVenkaiah Naidu addressing the 21st Foundation Day of Vivekananda Institute of Human Excellence
Next Story