విషాదం: కరోనా తో తండ్రీ, కొడుకుల మరణం.. కుటుంబమంతా క్వారంటైన్ లోకి!
కరోనా మహమ్మారి ఒక కుటుంబం మొత్తాన్ని విషాదంలోకి నెట్టేసింది. రెండు రోజుల వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి చెందగా మరో కొడుకు గాంధీ ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతున్నారు. ఈ విషాదం హైదరాబాద్ వనస్థలిపురం లో చోటు చేసుకుంది.
వనస్థలిపురానికి చెందిన వ్యక్తి (48)కి ఇటీవల కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబం మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా బాధితుడిని గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు.
ఈ క్రమంలో గత నెల 29న అతడి తండ్రి (76) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ కేంద్రంలో ఉండడంతో బల్దియా సిబ్బంది వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇక తాజాగా శుక్రవారం బాధితుడి సోదరుడు మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలో తండ్రీకుమారులు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే కరోనా బారిన పడిన వృద్ధుడి పెద్ద కుమారుడు గాంధీలో చికిత్స పొందుతుండగా, అతడి తల్లికి కూడా వైరస్ సంక్రమించింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ కేంద్రంలోనే ఉన్నారు.
బాధిత కుటుంబ సభ్యులు మొత్తం 8 మందికీ కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారులు చెప్పారు. ఈరోజు రిపోర్టులు వస్తాయన్నారు. ఇక ఈ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు చనిపోవడం, మిగిలిన వారు క్వారంటైన్ లో ఉండడంతో వారుంటున్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి ఆ ప్రాంతంలోని 40 కుటుంబాలను హోం క్వారంటైన్ లో ఉంచారు.




