హైదరాబాద్‌లో సిటీ బస్సుల పునప్రారంభంపై తర్జనభర్జనలు

హైదరాబాద్‌లో సిటీ బస్సుల పునప్రారంభంపై తర్జనభర్జనలు
x
Highlights

హైదరాబాదులో జనజీవనం సాధారణమైపోయింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఇప్పటికే ప్రారంభమై మామూలు స్థితికి వచ్చాయి. మెట్రో రైలు కూడా పునరుద్ధరణ జరిగి చాలా...

హైదరాబాదులో జనజీవనం సాధారణమైపోయింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఇప్పటికే ప్రారంభమై మామూలు స్థితికి వచ్చాయి. మెట్రో రైలు కూడా పునరుద్ధరణ జరిగి చాలా రోజులు అయింది మరి సిటీ బస్సులు ప్రారంభం ఎప్పుడా అని హైదరాబాద్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పక్క రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు ప్రారంభమై రెండు రోజులు గడిచిన హైదరాబాదులో బస్సులు ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ అనుమతి కోసం ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు.

కరోనా నియంత్రణలో భాగంగా హైదరాబాదులో ఆర్టీసీ బస్సులను నిలిపివేసి ఆరు నెలలు పూర్తవుతోంది. బస్సుల పునఃప్రారంభం పై కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్ నగరంలో దాదాపు 2500 బస్సులు ఇంకా డిపోలకే పరిమితమయ్యాయి. ఇప్పటికే మెట్రో ప్రారంభమై నగరంలో పరుగులు తీస్తున్నా సామాన్యుడికి అందుబాటులో ఉండే ఆర్టీసి బస్సులు ప్రారంభం కాకపోవడంతో నగర శివారు ప్రాంత ప్రజలతో పాటు మెట్రో లైన్ అందుబాటులో లేని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో కూడా బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ విషయమై ఆర్టీసి ఎండి సునీల్ శర్మ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే కోవిడ్ నిబంధనల మేరకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని తెలిపారు. సిటీలో ముందుగా 50% బస్సులు మాత్రమే నడిపించి ప్రయాణికుల రద్దీ మేరకు ఇతర బస్సులు నడిపిస్తామని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్టీసీ మరింత నష్టపోయే అవకాశం ఉందని వెంటనే నగరంలో బస్సులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులు లేఖలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉందని బస్సుల ప్రారంభం వల్ల వైరస్ వ్యాప్తి మరింత వేగంగా విజృభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ బస్సులు ప్రారంభిస్తే సిటీలో ప్రయాణికులు పెద్దగా లేనందున బస్సులు నడిపిస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తుంది. ఒకవేళ బస్సులు నడిస్తే 50 శాతం బస్సులు నడిచేలా ప్రణాళికలు రూపొందించాలని అవి రద్దీ ఉన్న రూట్లలోనే అధికంగా నడిపించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయం కోసం చాలా రోజుల నుండి ఆర్టీసీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అనుమతి వచ్చిన మరుక్షణమే బస్సులు నడిపించేలా ఉద్యోగులను సిద్ధం చేసి ఉంచారు.

ఇప్పటికే ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితిలో కూడా లేదు. కొత్త బస్సుల కొనుగోలుకు తెచ్చిన 650 కోట్ల నిధులు కోవిడ్ సమయంలో జీతాలకే కేటాయించారు. ఇటువంటి సమయంలో వెంటనే బస్సు సర్వీసులను ప్రారంభించాలని అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories