Drug Racket: డ్రగ్ రాకెట్ లో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు!

Drug Racket: డ్రగ్ రాకెట్ లో తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమేయంపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు.

Kranthi
Published on: 3 April 2021 8:50 AM IST
Three Telangana MLAs in Bangalore Drug Racket
X

Drug రాకెట్:(ఫోటో ది హన్స్ ఇండియా)

Drug Racket: డ్రగ్ రాకెట్ కేసులో కర్ణాటకలో తీగ లాగితే తెలంగాణలో డొంక బయటపడింది. బెంగళూరులో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఉద్యమకారుడినని చెప్పుకునే ఓ పెద్ద మనిషి డ్రగ్స్ రాకెట్‌లో ప్రధానంగా భాగం అయినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే నటుడు తనీష్‌ను బెంగళూరు పోలీసులు పిలిచి ప్రశ్నించారు. ఈ కేసులోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇతరులు బయటకు వస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రధానంగా లింకులు కనిపిస్తూండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కోసం బెంగళూరు పోలీసులు సన్నాహాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరన్నదానిపై స్పష్టత ఉన్నప్పటికీ.. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. నేడో..రేపో సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యమం పేరుతో హడావుడి చేసే వ్యక్తిని కూడా… అరెస్ట్ చేయనున్నారు. ఈయన పైకి ఉద్యమకారుడినని చెప్పుకుంటారు కానీ సినిమాలకు ఫైనాన్స్ చేయడం క్యాబ్‌ల వ్యాపారం చేయడం వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో సినిమా వాళ్లతో ఏర్పడిన పరిచయాలు డ్రగ్స్ మార్కెట్‌లో పాలు పంచుకునేదాకా తీసుకెళ్లాయని అనుమానిస్తున్నారు.

హైదరాబాద్‌లో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసును విజయవంతంగా తొక్కేశారు. హైదరాబాద్ పోలీసులు దాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పడేశారు. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సినీతారల్ని కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీగ మొత్తం లాగుతూంటే కేసు ఎక్కడెక్కడికో వెళ్తోంది. తాజాగా అది తెలంగాణ ఎమ్మెల్యేల వద్దకు చేరుతుంది. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే.. రాజకీయంగా పెను సంచలనం నమోదవుతుంది.

Kranthi

Kranthi

Next Story