GHMC ఎన్నికలకు కసరత్తు షురూ

GHMC ఎన్నికలకు కసరత్తు షురూ
x
Highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అయితే...

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఎన్నికలను ఈవీఎంలను ఉపయోగించి నిర్వహించాలా లేదా బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలా అనే అంశంపై ఈసీ సతమతమవుతూ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. కరోనా వైరస్ విస్తరిస్తుండంతో ఎన్నికలను ఈ రెండు పద్ధతుల్లో ఎలా నిర్వహించాలనే అంశంపై అభిప్రాయాలు కోరుతూ లేఖలు రాశారు. పార్టీ నాయకులు వారి వారి అభిప్రాయాలను సెప్టెంబరు నెలాఖరులోపు చెబితే మెజారిటీ అభిప్రాయం ప్రకారం ముందుకు వెళ్తామని, ఆ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. నిజానికి ఎన్నికల కమిషనర్ ముందుగా రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై చర్చిద్దామని అనుకన్నప్పటికీ కరోనా కారణంగా పార్టీలకు లేఖలు రాసింది.

ఇక ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను హైదరాబాద్‌ కార్పొరేషన్‌ బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహిస్తూ వచ్చారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తుండడంతో, అలాగే రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడతల వారిగా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ పాలక మండలికి పదవీకాలం పూర్తవుతుంది. అందుకని ఈ ఏడాదే ఎన్నికలు పూర్తి చేయాలని ఎస్ఈసీ భావిస్తోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎంలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. మరోవైపు గ్రేటర్‌లో అభివృద్ధి కార్యక్రమాలపైనా వరుస సమీక్షలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories