Coronavirus: రావద్దన్నా వినలేదు.. వాహనాలు సీజ్ చేసేశారు!

K V D Varma
Updated on: 24 March 2020 11:59 AM IST
Coronavirus: రావద్దన్నా వినలేదు.. వాహనాలు సీజ్ చేసేశారు!
X
representational image

కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దనీ, అదీ ఇంటి నుంచి ఒక్కరు మాత్రమె రావాలనీ కోరింది. ఎటువంటి పరిస్థితిలోనూ గుంపులుగా రోడ్ల మీద కనిపించావద్దని హెచ్చరించింది.

పోలీసులు పదే పదే ఈ విషయాన్ని ప్రజలకు చెబుతూ వచ్చారు. అంతే కాకుండా అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కేసులు పెడతామని.. వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయితే, ఈ నిబంధనలు తోసిరాజని చాలా మంది ఇష్టానుసారంగా రోడ్లమీద తిరిగేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పై అందరూ రోడ్లమీద చక్కర్లు కొడుతున్నారు. దీంతో పోలీసులు చలానా కొరడా ఝుళిపించడమే కాకుండా.. వాహనాలను సీజ్ చేయడం మొదలు పెట్టారు.

ఇందులో భాగం హైదరాబాద్‌లో తొలి రోజే (మార్చి 23) 2480 వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ పాటించని వాహనదారులు, ప్రజలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి పరిస్థితిని నిశితంగా గమనించిన పోలీసులు.. ప్రజలు మాట వినటం లేదనీ, కట్టు తప్పుతున్నారానీ గ్రహించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి నగరంలోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని 25 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 73 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మొత్తం 2480 వాహనాలను సీజ్‌ చేసినట్లు ట్రాఫిక్‌ విభాగం అదనపు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వీటిలో 1058 బైక్‌లు, 948 ఆటోలు, 429 కార్లు, ఇతర ఫోర్ వీలర్లు, 45 ఇతర వాహనాలు ఉన్నట్లు వెల్లడించారు.

K V D Varma

K V D Varma

Next Story