Telangana Inter Syllabus : ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గుదల

Telangana Inter Syllabus : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం కాస్త...
Telangana Inter Syllabus : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం జీరో ఇయర్‌గా మిగిలిపోకుండా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. అంతే కాక ఇంటర్ సిలబస్‌లో కూడా కొన్ని మార్పులు చేసింది. సీబీఎస్ఈ అలాగే కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు సిలబస్‌లో 30 శాతం కుదిస్తున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు సిలబస్‌ను సవరించామని.. రెండో సంవత్సరం చరిత్ర, అర్థశాస్త్రం, పౌర శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్ సిలబస్‌లో మార్పులు చేసినట్లు వివరించారు.
కుదించిన సిలబస్ ప్రకారమే వార్షిక, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. హ్యుమానిటీస్, మొదటి, రెండో లాంగ్వేజీల్లో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 30 శాతం కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. సైన్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ తొలగించిన పాఠాలను కుదించినట్లు జలీల్ చెప్పారు. ఇక ఇలా కుదించిన సిలబస్ ఈ ఏడాదికి మాత్రమే పరిమితం అని ఆయన అన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఇంతకు ముందు వున్న సిలబస్ నే బోధిస్తమని ఆయన స్పష్టం చేశారు. తగ్గించిన సిలబస్ వివరాలను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో సందర్శించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.