ఆరోగ్య శ్రీలోకి కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌

ఆరోగ్య శ్రీలోకి కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం పరిధిలోకి...

తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం పరిధిలోకి మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను కూడా తీసుకురావాల‌ని మంత్రివ‌ర్గ ఉప‌సంఘం నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌కు రూ. 30 ల‌క్ష‌ల నుంచి రూ. 40 ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతుంద‌ని ఇది పేద‌ల‌కు భారంగా మారింద‌న్నారు. ప్రస్తుతం మూత్ర‌పిండాలు, గుండె, కాలేయ మార్పిడి శ‌స్ర్త‌చికిత్స‌లు కేవ‌లం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్ప‌త్రుల్లోనే కొన‌సాగుతున్నాయ‌ని, వీటిని మెడిక‌ల్ కాలేజీల అనుబంధ ఆస్ప‌త్రుల‌కు విస్త‌రింప‌జేస్తామ‌ని మంత్రి తెలిపారు. కాగా ఈ మూడింటిని ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి చేర్చి పేద‌ల‌పై రూపాయి భారం ప‌డ‌కుండా ఉచిత వైద్యం అందిస్తామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే ఈ ప్ర‌తిపాద‌న‌కు సంబంధించిన చ‌ట్టంలో కూడా మార్పులు చేస్తామ‌న్నారు.

న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో వైద్యారోగ్య శాఖ బ‌లోపేతానికి సీఎం కేసీఆర్ నియ‌మించిన కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీ అయింది. మంత్రివర్గ ఉపసంఘంలో ఈటల రాజేందర్ అధ్యక్షత‌న ఏర్పాటైన స‌మావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్ర‌బెల్లి, త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ స‌హా ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ముగిసిన అనంత‌రం మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సేవ‌లో ఆరోగ్య శాఖ నిమ‌గ్న‌మైంద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. ఆ దిశ‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖనుబలోపేతం చేయాలని ఆదేశించిన‌ట్లు తెలిపారు. కరోనా ప్ర‌భావంతో వైద్య శాఖ‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. క‌రోనా లాంటి క‌ష్ట‌కాలంలో పనిచేసిన ప్రతి ఒక్క వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. గత ఆరు నెలలుగా అందరూ ఇళ్ళకు మాత్రమే పరిమితమైతే ఆరోగ్య‌శాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నం అయ్యింద‌ని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ వ‌చ్చే నాటికి మాతా శిశుమ‌ర‌ణాల రేటు 92 ఉంటే, ప్ర‌స్తుతం 63కు త‌గ్గింద‌న్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మేలైన వైద్యం అందిస్తున్న రాష్ర్టాల్లో కేర‌ళ‌, త‌మిళ‌నాడు మొదటి, రెండు స్థానాల్లో నిల‌వ‌గా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింద‌ని గుర్తు చేశారు. క్యాన్స‌ర్ రోగుల కోసం ఎంఎన్‌జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. అన్ని పీహెచ్‌సీల‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని, ప్ర‌తి ఆస్ప‌త్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐతో పాటు ఎక్స్ రే సౌక‌ర్యాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

న‌గ‌రంలో పేదప్రజల కోసం నిర్మించిన బ‌స్తీ ద‌వాఖానాలు విజ‌య‌వంతంగా ప‌ని చేస్తున్నాయ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే 198 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్రారంభించామ‌న్నారు. బ‌స్తీ ద‌వాఖానాల్లో మెరుగైన వైద్య సేవ‌లు అంద‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని మంత్రి తెలిపారు. మ‌రో 26 ద‌వాఖానాల‌ను ఈ నెల‌లో ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ప్ర‌తి మండ‌లానికి 108 అంబులెన్స్‌ల‌ను స‌మ‌కూర్చుతామ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories