Telangana : నిరక్షరాస్యులు 31 లక్షలు

Sumitra
Updated on: 22 Jan 2020 10:11 AM IST
Telangana : నిరక్షరాస్యులు 31 లక్షలు
X

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. ఈ కోణంలోనే గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని వాటిని తీర్చేందుకు ప్రయత్నించారు. అంతే కాక ప్రతి గ్రామంలోనూ అక్షరాస్యతపై సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలకు సంబంధించిన నివేదికను శనివారంవరకు విడుదలచేసారు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామపంచాయతీలు ఉన్నాయన్నారు.

వాటిలో 12,507 గ్రామాల్లో సర్వే పూర్తిచేశామని అధికారులు తెలిపారు. రష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 2,04,71,664 జనాభా ఉండగా వారిలో 18 నుంచి 60 ఏండ్ల వరకు వయసు ఉండి అక్షర జ్ఞానంలేనివారినే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ లెక్కల ప్రకారం నిరక్షరాస్యుల సంఖ్య 31,46,311 మందిగా తేలింది. వారిలో పురుషులు 11,06,487 మందిగాను, మహిళలు 20,39,386 మందిగాను, ఇతరులు 438 మందిగా ఉన్నారు. ఇకపోతే కొన్ని జిల్లాల్లో మాత్రం సాంకేతిక కారణాల వలన కొంత మేరకు సర్వే పూర్తి స్ధాయిలో కాలేదని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 73.23శాతం, నిర్మల్‌ 92.42, వనపర్తి 75.29, నారాయణపేట జిల్లాల్లో 96.79, మహబూబ్‌నగర్‌ 96.37, శాతం మాత్రమే సర్వే పూర్తయిందన్నారు. నల్లగొండ జిల్లాలో ఒక్క గ్రామంలో మాత్రమే ఇంకా సర్వే పూర్తి కాలేదన్నారు. మిగిలిన జిల్లాల్లోని గ్రామపంచాయతీల్లో సర్వే వందశాతం పూర్తి చేసినట్టు పంచాయతీరాజ్‌శాఖ వెల్లడించింది.

ఈ నెల 22న మున్సిపల్‌ ఎన్నికలు ఉండడంతో పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులను గణల చేయలేదని అన్నారు. కొంత మంది గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాలకు వలస వచ్చి ఉండడంతో అర్బన్‌ ఏరియాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు చిన్న వయస్సుల్లోనే వివాహాలు చేయడం, ఆర్థికపరమైన కష్టాలు ఉండడంతో అక్షరాస్యత శాతం తగ్గిందని తెలిపారు.

ఈ నేపథ‌్యంలోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అక్షరాలు నేర్పించనే ఉద్దేశ్యంతో 'ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌' కార్యక్రమాన్ని రూపొందిచారు. ఇందులో భాగంగానే గ్రామస్తులకు చదువు నేర్పించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎక్కవ మంది భాగస్వాములయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో గుర్తించిన జాబితా ఆధారంగా త్వరలో చాలా మందికి అక్షరాలు నేర్పించనున్నారు. మరి కొన్నిచోట్ల మహిళా సంఘాలే ఈ బాధ్యత తీసుకొనేందుకు ముందుకొస్తున్నాయి.




Sumitra

Sumitra

Next Story