Top
logo

శ్రీరాంసాగర్ కు భారీగా చేరుతున్న వరదనీరు

శ్రీరాంసాగర్ కు భారీగా చేరుతున్న వరదనీరు
X
Highlights

Sri Ram Sagar Project: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో...

Sri Ram Sagar Project: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని చెరువులు మత్తళ్లు పారుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 50వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. కల్యాణి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి రెండేళ్ల తరవాత వరద నీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి లో 77 నిజామాబాద్ జిల్లాలో 273 చెరువులు పూర్దిస్దాయిలో నిండి జలకళను సంతరించుకున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బీర్కూర్ లో కురిసిన వర్షాలకు గ్రామాల్లోని వాగులు- వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిరికొండ మండలం తాళ్ల రామడుగు చెరువు మత్తడి పోస్తోంది. కోనాపూర్ రాళ్లవాగు ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుంది. జిల్లాలో 12 వందల 2 చెరువులకు గాను ఇప్పటి వరకు 273 చెరువులు పూర్తిస్థాయిలో నిండగా, 364 చెరువులు 75 శాతం నిండినట్లు ఇరిగేషన్ అధికారులు చెప్పారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ రూరల్ లో జనజీవనం స్తంభించింది.

మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 50వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోది. ప్రాజెక్టు నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది. వర్షాలు కురుస్తుండటంతో కాల్వల ద్వారా కేవలం 1156 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు వదులుతున్నారు.

కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు జుక్కల్ లో నల్లవాగు మత్తడి పారుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని మొత్తం 226 చెరువుల్లో 77 చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో కళ్యాణి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టులోకి 328 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 288 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఓ ప్రాజెక్టు గేటు ఎత్తి దిగువకు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టులకు స్వల్ప వరద వస్తోంది. రెండేళ్ల తరవాత నిజాంసాగర్ ప్రాజెక్టుకు 800 క్యూసెక్కుల మేర వరద నీరు వస్తోంది. జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి వేముల ప్రశాంత్ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Web TitleSri Ram Sagar Project receives good inflows
Next Story