logo

ఆదిలాబాద్‌‌లో గులాబీ సర్వే గుబులేంటి?

ఆదిలాబాద్‌‌లో గులాబీ సర్వే గుబులేంటి?
Highlights

ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు. పైగా ఓ ఎమ్మెల్యే భర్త. ఎంపీ కావాలని ఆశపడ్డారు. టికెట్ రాక భంగపడ్డారు. అక్కడితో...

ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు. పైగా ఓ ఎమ్మెల్యే భర్త. ఎంపీ కావాలని ఆశపడ్డారు. టికెట్ రాక భంగపడ్డారు. అక్కడితో ఆగలేదట. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడట. సొంత పార్టీ ఎంపీ అభ్యర్థిని ఓడించేంత వరకూ నిద్రపోలేదట. ఇదంతా ఎవరో దారినపోయే దానయ్య చెప్పడం లేదు. పార్టీ అధిష్టానం నియమించిన ముగ్గురు సభ్యుల బృందమే, అంతర్గత సర్వేతో తేల్చిందట. సర్వే రిపోర్ట్ చూసి, హైకమాండ్ పెద్దలు షాకయితే, తనపై చర్యలు తీసుకుంటారేమోనని, సదరు ఉద్యోగ సంఘాల నాయకుడు టెన్షన్‌ పడుతున్నాడట.

ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటమిపై అంతర్గత సర్వే నిర్వహించింది టీఆర్ఎస్ అధిష్టానం. కంచుకోటలాంటి నియోజకవర్గంలో పరాజయం ఎందుకు ఎదురైందో తేల్చాలని ముగ్గురు సభ్యుల బృందానికి అప్పగించింది. చాలారోజుల పాటు క్షేత్రస్థాయిలోనూ సర్వే చేసిన ముగ్గురు సభ్యులు, అసలు వాస్తవాలు తెలిసి విస్తుపోయారట. అదే నివేదికను చూసి, గులాబీ హైకమాండ్‌ కూడా షాకయ్యిందట. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఓటమికి దారి తీసిన కారణాలపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించారు సభ్యులు. ఈ అంతర్గత సర్వేలో సంచనాలత్మక అంశాలు బయటపడ్డాయి. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో మోడీ ప్రభావం ఉందని తేలినప్పటికీ, మిగతా సెగ్మెంట్లలో తక్కువ మెజారిటీ రావడానికి సొంత పార్టీ నేతలే కారణమని తేల్చారు సభ్యులు.

ఖానాపూర్ నియోజకవర్గంలో సర్వే టీం, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్‌కు 60,748 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి సోయం బాపురావుకు 47,481 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్‌కు 30,248 ఓట్లు పోలయ్యాయి. దాంతో ఈ నియోజకవర్గంలో మూడవ స్థానానికి దిగజారింది టీఆర్ఎస్‌. ఎంపీ అభ్యర్థి నగేష్ ఓటమికి ఈ నియోజకవర్గమే దాదాపు కారణమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఇరవై వేలకు పైగా మెజారిటీతో వస్తే, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం, పార్టీ మూడవ స్థానానికి దిగజారడంపై నిపుణులు విశ్లేషించారు. ఇక్కడ ఓట్లురాకపోవడంతోనే ఎంపి అభ్యర్థి నగేష్ పరాజయం పాలయ్యారని తేల్చారు. అయితే ఇందుకు కారణమైనవారెవరో తెలుసుకుని మరింత షాకయ్యారు.

ఖానాపూర్ నియోజకవర్గంలో ఒక్క ప్రజాప్రతినిధి కూడాలేని బీజేపీ, రెండవ స్థానంలో నిలిచింది. కాని ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఉండి కూడా టీఆర్ఎస్‌ మూడో స్థానానికి దిగజారింది. ఇందుకు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రేఖనాయక్ వైఫల్యమే కారణమని, సొంత పార్టీ నేతలే అంటున్నారు. అంతేకాదు, ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ కూడా, టీఆర్ఎస్‌ అభ్యర్థిని ఓడించేందుకు సైలెంట్‌గా స్కెచ్‌ వేశారని సర్వే చేసిన నిపుణులు తేల్చడం, గులాబీ నేతలను విస్మయానికి గురి చేసిందట.

ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టిఎన్‌జీవో అధ్యక్షుడు. ఎంపీ టికెట్‌ ఆశించారు శ్యామ్ నాయక్. భార్య ద్వారా, టీఎన్‌జీవో నేతల ద్వారా చాలా మంత్రాంగం నడిపారు. కాని సిట్టింగ్‌ ఎంపీ నగేష్‌ వైపే మొగ్గు చూపింది టీఆర్‌ఎస్‌ హైకమాండ్. టికెట్‌ రాకపోవడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన శ్యామ్‌ నాయక్, నగేష్‌ ఓటమికి చాపకింద నీరులా పని చేశాడని సర్వే తేల్చిందని, టీఆర్ఎస్ నేతలు సణుక్కుంటున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్‌కు అసలు ప్రచారం చేయలేదట శ్యామ్ నాయక్. మరోవైపు నగేష్ ఓడిపోవడంతో శ్యామ్‌కు రూట్ క్లియర్ అయినట్టయ్యిందని అనుచరులు మాట్లాడుకుంటున్నారని తెలిసింది. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోనైనా తమ నేతకు టికెట్ ఇస్తారన్న ఆశలో ఉన్నారట శ్యామ్ అభిమానులు. అయితే ఇదే సమయంలో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలపై చేయించిన సర్వే మాత్రం, శ్యామ్‌ గుండెల్లో గుబులు రేపుతోందట. పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం కావడంపై సర్వే ఆధారంగా పార్టీ పెద్దలకు దూతలు నివేదిస్తున్నారట. చర్యలు కూడా తప్పవని సంకేతాలు లిస్తున్నారట. మరి నగేష్ ఓటమితో శ్యామ్ నాయక్ అనుచరులు సంతోషంగా ఉన్నా, మరోవైపు ఓటమిపై పార్టీ పెద్దలు చర్యలు తీసుకుంటారని టెన్షన్ పడుతున్నారట. మరి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
లైవ్ టీవి


Share it
Top